|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:27 PM
వెస్టిండీస్‌పై కీలక మ్యాచ్‌లో అజేయంగా 97 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన సంజూ శాంసన్‌పై లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా సంజూ శాంసన్ తన ప్రతిభకు తగిన గుర్తింపు పొందాడని ఆయన అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ గవాస్కర్, ఈ 97 పరుగులు కేవలం మ్యాచ్‌ను గెలిపించిన ఇన్నింగ్స్ మాత్రమే కాదని, సంజూ ఎదుర్కొన్న కష్టకాలానికి ముగింపు పలికిన భావోద్వేగ ఘట్టమని వివరించారు.
“ఈ 97 నాటౌట్ సంజూ భుజాల మీదున్న ఒత్తిడిని మాత్రమే కాదు, అతన్ని ఇష్టపడే అందరి మనసులపై ఉన్న భారం కూడా తగ్గించింది. అతను చాలా మంచి ఆటగాడు. ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడు. అయినా అందరూ అతను విజయవంతం కావాలని కోరుకున్నారు” అని గవాస్కర్ అన్నారు.
ఈ మ్యాచ్ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా కోల్‌కతాలో జరగ్గా, సంజూ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను విజయపథంలో నడిపించాడు. దీంతో భారత్ సెమీఫైనల్‌కు చేరి ఇంగ్లండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ముంబైలో జరగనుంది. గవాస్కర్ మాట్లాడుతూ “ఈ నిజాయితీ గల క్రికెటర్‌కు తగిన విజయం లభించడం భారత అభిమానులందరికీ ఆనందం కలిగించే విషయం” అని అన్నారు.
అంతేకాదు, భారత్ ఛేజ్ విజయంపై కూడా ఆయన విశ్లేషణ చేశారు. ముఖ్యంగా డాట్ బాల్స్ తగ్గించడమే విజయ రహస్యం అని తెలిపారు. “ఒక ఎండ్‌లో సెటైన బ్యాటర్ ఉంటే, మరొకరు సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ ఇస్తారు. అలా డాట్ బాల్స్ తగ్గుతాయి. టీ20లో అదే కీలకం” అని చెప్పారు. 120 బంతుల్లో 80–85 బంతుల్లో స్కోరు చేస్తే 190–200 లక్ష్యాలను చేధించడం సాధ్యమని గవాస్కర్ వివరించారు. వెస్టిండీస్‌పై భారత్ అదే విధానాన్ని అమలు చేసిందన్నారు. విజయ పరుగు కొట్టిన తర్వాత సంజూ ముఖంలో కనిపించిన భావోద్వేగాలు ప్రతి అభిమానిని కదిలించాయని గవాస్కర్ చెప్పారు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఆగిపోయినా, ఈ 97 అతనికి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఇచ్చిందని వ్యాఖ్యానించారు.
Latest News