|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:22 PM
భారత క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యువ ప్రతిభావంతుల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. దీని కోసం భారత మాజీ దిగ్గజాలు జహీర్ ఖాన్ , హర్భజన్ సింగ్‌లను బీసీసీఐ సంప్రదించి, కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈ క్యాంపులకు ఎంపికయ్యే ఆటగాళ్లు అండర్-19, ఫస్ట్ క్లాస్, ఇండియా-ఏ స్థాయిలో మంచి ప్రదర్శన చేసిన యువ క్రికెటర్లు కావడం విశేషం. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశమున్న ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ జాబితా రూపొందించనున్నారు. జహీర్ ఖాన్ ఇప్పటికే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో యువ ఫాస్ట్ బౌలర్లతో ఐదు రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి సెంటర్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
అలాగే, ఆఫ్-స్పిన్నర్ల కోసం హర్భజన్ సింగ్ ప్రత్యేక క్యాంప్ నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఇక లెగ్ స్పిన్, రిస్ట్ స్పిన్ విభాగంలో శిక్షణ ఇవ్వడానికి అనిల్ కుంబ్లేను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ క్యాంపులు ఐపీఎల్‌కు ముందే నిర్వహించనున్నారు. ఎందుకంటే చాలా మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో కూడా ఆడుతుండటంతో.. ఈ లోపే స్పెషల్ క్యాంప్‌లను బీసీసీఐ ఏర్పాటు చేసింది.
ఇలాంటి శిక్షణ కార్యక్రమాలకు గతంలో జగ్మోహన్ దాల్మియా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్రీకారం చుట్టారు. అప్పట్లో చందు, ప్రసన్న, సయ్యద్ వంటి దిగ్గజాలు యువతకు మార్గదర్శకత్వం వహించారు. ఇక పేస్ బౌలింగ్ కోచ్ పోస్టుకు వీఆర్కే సింగ్, శ్రీనాథ్ అరవింద్ దరఖాస్తు చేసుకున్నారు. ఇంగ్లండ్ కోచ్ Troy Cooley పదవీ విరమణ తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. స్పిన్ విభాగానికి ప్రస్తుతం సునీల్ జోషి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ శిబిరాల ద్వారా యువ ఆటగాళ్లకు అనుభవం, నైపుణ్యం, మానసిక ధైర్యం పెరిగి, జాతీయ జట్టుకు బలమైన బేస్ ఏర్పడుతుందని బీసీసీఐ ఆశిస్తోంది.
Latest News