|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 08:09 PM
ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ సోమవారం న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా-కెనడా సీఈవోల ఫోరమ్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇరు దేశాల సంబంధాలను క్రికెట్‌తో పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023లో ఖలిస్తానీ వేర్పాటువాద కార్యకలాపాల కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకునే దిశగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ మీలో చాలామంది క్రికెట్‌ను గమనిస్తూనే ఉంటారు. భారత్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో కెనడా జట్టు ఆడటం మనందరికీ ఎంతో సంతోషాన్నిచ్చింది. టీ20 క్రికెట్‌లో వేగవంతమైన నిర్ణయాలు, భయంలేని స్ట్రోక్స్, మ్యాచ్ విన్నింగ్ పార్ట్‌నర్‌షిప్‌లు ఎలా ఉంటాయో అలాగే భారత్, కెనడా కూడా కలిసి భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాయి అని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని ఆయన పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.మరోవైపు, భారత్‌లో జరిగిన 2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో కెనడా ప్రదర్శన అంతంతమాత్రంగానే సాగింది. గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ వంటి జట్లతో పోటీపడిన కెనడా ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలై గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు పోరాడినా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్‌లో అప్పుడప్పుడు మెరుపులు మెరిపించినా నిలకడలేమి కారణంగా సూపర్-8 రేసులోకి రాలేకపోయింది.
Latest News