|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 08:01 PM
నాలుగు రోజుల క్రితమే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య సందడిగా పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆశపడ్డాడు. ఇంతలో ఏం జరిగిందో, ఏమో ఆ యువకుడు చెరువులో శవమై కనిపించాడు. వరుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పెళ్లింట విషాద చాయలు అలముకున్నాయి.. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో మిన్నంటింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కమ్మనపల్లె పంచాయతీ జోగిండ్లలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
జోగిండ్లకు చెందిన నరసింహులు కుమారుడు జె మురళి.. ప్రస్తుతం సీఎస్‌సీ కేంద్రంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగేళ్ల క్రితం బంధువుల్లో అమ్మాయితో వివాహం జరిగింది. కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు.. కోర్టు నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. నరసింహులు కుమారుడు మురళికి రెండో పెళ్లి చేద్దామని నిర్ణయించాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన సుజాతతో పెళ్లి సంబంధం మాట్లాడారు. గత నెల 25న మురళి, సుజతాల పెళ్లి ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 28న మురళి సీఎస్‌సీ కేంద్రానికి విధులకు హాజరయ్యేందుకు వెళ్లాడు. ఉదయం ఇంటి నుంచి ఉద్యోగినికి వెళ్లిన మురళి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం మురళి ఆచూకీ కోసం ప్రయత్నించినా దొరకలేదు. చివరికి అతడి కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మురళి మిస్సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇంతలో బైరెడ్డిపల్లె పెద్దచెరువుకు చేపలుపట్టడానికి కొందరు వచ్చారు. అక్కడ చెరువు ఒడ్డున చెప్పులు కనిపించాయి. వెంటనే స్థానికులకు సమాచారం ఇవ్వగా.. ఆ చెప్పులు మురళివి అని తేలింది.. వెంటనే ఈతగాళ్లు చెరువులో గాలించగా అతడి మృతదేహం దొరికింది. మురళి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. మురళి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మురళి మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది.. నాలుగు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న యువకుడి మరణానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. మురళిది ఆత్మహత్య అని చెబుతున్నారు.. కారణం ఏంటనేది తేలాల్సి ఉంది. శుక్రవారం రోజు ఏం జరిగిందనే కోణంలో ఆరా తీస్తున్నారు.