|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:24 PM
నేటి కాలంలో మ్యూజిక్ కన్సర్ట్‌లకు వెళ్లడమంటే కేవలం వినోదం మాత్రమే కాదు జేబుకు చిల్లు పడటం కూడా అని మరోసారి నిరూపితమైంది. ప్రముఖ పంజాబీ గాయకుడు కరణ్ ఔజ్లా 'పి-పాప్ కల్చర్ ఇండియా టూర్ 2026'లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన కన్సర్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే అది ఆయన పాటల గురించి కాదు.. అక్కడ విక్రయించిన నీళ్ల బాటిళ్ల ధర గురించి. ఎందుకంటే 20 రూపాయల విలువ చేసే ఒక్క వాటర్ బాటిల్‌ను ఏకంగా రూ.100కు అమ్ముకుని.. సంగీత ప్రియులను దోచుకున్నారు.
"మరీ ఇంత దోపిడీనా?"
ఫిబ్రవరి 28న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కన్సర్ట్ బయట.. ఓ విక్రేత ఒక్క వాటర్ బాటిల్‌ను రూ.100 కు విక్రయించాడు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఓ సోషల్ మీడియా యూజర్ .. దాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆ వీడియోలో ఒక విక్రేతను నీళ్ల బాటిల్ ధర అడగగా.., అతను ఏమాత్రం తడుముకోకుండా "100 రూపాయలు" అని సమాధానం ఇచ్చాడు. "మరీ ఇంత దారుణమా?" అంటూ ఆ యూజర్ పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు యాజమాన్యంపై నిప్పులు చెరుగుతున్నారు.
పాటలు హిట్.. మేనేజ్‌మెంట్ ఫ్లాప్!
ఈ కన్సర్ట్‌కు దాదాపు 75,000 మందికి పైగా అభిమానులు తరలివచ్చారు. కరణ్ ఔజ్లా తన ఫేమస్ ట్రాక్ 'ఆన్ టాప్' పాడుతూ జిప్-లైన్ ద్వారా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. 'సాఫ్ట్‌లీ', 'విన్నింగ్ స్పీచ్' వంటి పాటలతో ఆయన ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కానీ లోపల మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అనేకమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. వేల రూపాయల బ్యాండ్ పాస్‌లు ఉన్నా తమను లోపలికి అనుమతించలేదని, గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరికొన్ని చోట్ల జనం మధ్య తీవ్రమైన తోపులాటలు, గొడవలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. "కన్సర్ట్ టికెట్లు ఇప్పటికే ఖరీదైనవి. ఇక మంచినీటికి కూడా వంద రూపాయలు వసూలు చేస్తే సామాన్యులు ఎలా వెళ్తారు?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలను తీసుకోవాలని వినియోగదారుల ఫోరమ్‌కు సూచిస్తున్నారు.
Latest News