వేగంగా బరువు తగ్గడం వల్ల మీ కిడ్నీలు, లివర్‌పై ఎఫెక్ట్
 

by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:00 AM

ఈ రోజుల్లో చాలా మంది సన్నగా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. దీనిని సాధించడానికి వేగంగా బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. దీని కోసం సోషల్ మీడియాను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా డైట్ ప్లాన్స్, కొవ్వును కరిగించే సప్లిమెంట్స్, క్రాష్ డైట్స్ ఫాలో అవుతున్నారు. అయితే, క్రాష్ డైట్స్ ద్వారా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం చూడటానికి మంచి ఫలితమే అనిపించినా, అది లోలోపల అవయవాల్ని దెబ్బతీస్తుంది.


ఈ విషయం గురించి డాక్టర్ షీలా జోసెఫ్, కన్సల్టెంట్ డైటెటిక్స్ & న్యూట్రిషన్ (స్పార్ష్ హాస్పిటల్ ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరు) వివరించారు. వేగంగా బరువు తగ్గడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయో పూర్తిగా వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


డాక్టర్ ఏం చెప్పారు?


క్రాష్ డైట్‌ల ద్వారా తక్కువ సమయంలోనే బరువు తగ్గడం చూడటానికి మంచి ఫలితమే అనిపించినా, అది లోలోపల మన అవయవాలను దెబ్బతీస్తుంది. శరీరాన్ని బలహీనపరచడమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. బరువు తగ్గడం గురించి ఆలోచిస్తుంటే, మొదట దాని ప్రమాదాల్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.


డాక్టర్ షీలా జోసెఫ్


వేగంగా బరువు తగ్గడం వల్ల కలిగే నష్టాలు


కండరాల నష్టం: శరీరం కేలరీల కొరతను ఎదుర్కొన్నప్పుడు.. కేవలం కొవ్వును మాత్రమే కాకుండా కండరాల్ని కూడా కరిగించి శక్తిని పొందుతుంది. దీనివల్ల శరీరం బలహీనపడుతుంది. మీరు తగినంత ప్రోటీన్ పొందకపోతే, శరీరం శక్తి కోసం కండరాల్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఇది బలహీనతకు దారితీస్తుంది.


కాలేయం, మూత్రపిండాలపై ఒత్తిడి: హఠాత్తుగా ఆహారం మానేయడం వల్ల శరీరంలోని టాక్సిన్లను, వ్యర్థాల్ని శుద్ధి చేసే క్రమంలో కాలేయం (Liver), మూత్రపిండాలపై (Kidneys) తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది.


గుండె ఆరోగ్యం: కేలరీలను ఒక్కసారిగా తగ్గించడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది గుండె లయలో మార్పులకు (Arrhythmia) దారితీసి, ప్రాణాపాయం కలిగించవచ్చు.


పిత్తాశయ రాళ్లు (Gallstones): విపరీతమైన డైటింగ్ వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.


మెటబాలిజం మందగించడం: వేగంగా బరువు తగ్గడం వల్ల శరీర జీవక్రియ వేగం (మెటబాలిక్ రేట్) తగ్గిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో బరువు తగ్గడం ఇంకా కష్టమవుతుంది.


హార్మోన్ల అసమతుల్యత: హార్మోన్ల పనితీరులో అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో నీరసం, అలసట, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


మళ్ళీ బరువు పెరగడం: క్రష్ డైట్‌లు ఆపగానే, కోల్పోయిన బరువు కంటే రెట్టింపు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


సరైన పద్ధతి ఏంటి?


మాయోక్లినిక్‌‌లో పబ్లిష్ అయినఓ నివేదిక ప్రకారం వారానికి 0.5 నుంచి 1 కిలోగ్రాము బరువు తగ్గడం అనేది అత్యంత సురక్షితమైన పద్ధతి. ఈ వేగంతో తగ్గడం వల్ల కండరాల నష్టం, పోషకాహార లోపం రాకుండా కొవ్వు మాత్రమే కరుగుతుంది. దీని కోసం రోజుకు తీసుకునే కేలరీల సంఖ్యను 500 -1000 వరకు తగ్గించాలి. సమతుల్య ఆహారాన్ని భాగం చేసుకోవాలి. కేవలం ఆహారంపై కంట్రోల్ ఉండటమే కాకుండా శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి.


సమతుల్య ఆహార ప్రణాళిక


బరువు తగ్గడం అంటే ఆహారం మానేయడం కాదు, సరైన ఆహారం తీసుకోవడం.


1) ఉదయం (Breakfast):


ఇడ్లీ (2-3) లేదా దోశ కంటే.. ఓట్స్, రాగి జావ, లేదా తక్కువ నూనెతో పెసరట్టు తీసుకోవడం మంచిది.


వీటితో పాటు ఒక ఉడకబెట్టిన గుడ్డు (తెల్లసొన) తీసుకుంటే ప్రోటీన్ అందుతుంది.


2) మధ్యాహ్నం (Lunch):


వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా కొర్రలు తీసుకోండి.


కప్పు అన్నం ఉంటే, రెండు కప్పుల కూర ఉండాలి. పప్పు లేదా పెరుగును మితంగా చేర్చుకోండి.


3) సాయంత్రం (Evening Snacks):


నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండండి. వాటికి బదులుగా గుప్పెడు వేయించిన శనగలు, బాదం పప్పులు లేదా ఏదైనా ఒక పండు తీసుకోండి.


4) రాత్రి (Dinner):


రాత్రి 8 గంటల లోపు భోజనం ముగించండి.


రెండు పుల్కాలు (నూనె లేకుండా), ఏదైనా ఆకుకూర లేదా కూరగాయల కూర తీసుకోండి.


వ్యాయామం కూడా ముఖ్యమే


కేవలం డైట్ మాత్రమే కాకుండా, శారీరక శ్రమ కూడా తోడైతే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు వివరిస్తున్నారు.


కార్డియో వ్యాయామాలు: ప్రతిరోజూ కనీసం 30-40 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్), సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి భాగం చేసుకోండి.


బలహీనపడకుండా ఉండటానికి: వారానికి 2-3 రోజులు చిన్నపాటి వెయిట్ లిఫ్టింగ్ లేదా యోగాసనాలు చేయడం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి.


చురుకుగా ఉండటం: లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కడం, ఆఫీసులో వర్క్ మధ్యలో చిన్నపాటి నడక వంటివి అలవాటు చేసుకోండి.


పాటించాల్సిన ఇతర జాగ్రత్తలు


నీరు ఎక్కువగా తాగండి: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు అంటే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి.


చక్కెర, ఉప్పు తగ్గించండి: స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండండి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు గుడ్ బై చెప్పండి.


నిద్ర: రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే హార్మోన్ల అసమతుల్యత వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.


చివరగా ఏం తెలుసుకోవాలి?


ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన బరువు తగ్గుదల కనిపిస్తుంది. అయితే, మీకు థైరాయిడ్, పీసీఓడీ (PCOD) లేదా మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే.. కొత్త డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM