సీజనల్ హెయిర్ ఫాల్ లేదా శాశ్వతంగా జుట్టు పల్చబడటం మధ్య తేడా ఏంటి
 

by Suryaa Desk | Sun, Mar 01, 2026, 11:58 PM

ఈ రోజుల్లో జుట్టు రాలడం అనే సమస్య అందర్నీ ఇబ్బందికి గురిచేసే విషయం. అయితే, అది కేవలం సీజనల్ అంటే వాతావరణ తాత్కాలిక మార్పుల వల్ల జరుగుతుందా లేదా అది శాశ్వత జుట్టు పల్చబడటమా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం అనేవి రెండు వేర్వేరు సమస్యలు. కానీ చాలా మంది వాటిని ఒకే విషయంగా తప్పుగా భావిస్తారు. ఈ రెండు సమస్యలకు జన్యుపరమైన ప్రభావాలు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి లేదా సరైన ఆహారం లేకపోవడం వంటి విభిన్న కారణాలు ఉండొచ్చని డాక్టర్ ప్రకృతి కె ఎన్, సీనియర్ కన్సల్టెంట్ (డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మోటాలజిస్ట్, స్పర్ష్ హాస్పిటల్, సర్జాపూర్ రోడ్ బెంగళూరు) వివరిస్తున్నారు.


డాక్టర్ ఏం చెబుతున్నారు?


సీజనల్ హెయిర్ ఫాల్, శాశ్వాతంగా జుట్టు పల్చబడటం మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల జుట్టు రాలడం సహజం. ఇది తాత్కాలికం. మరోవైపు శాశ్వత జుట్టు పలచబడటం అనేది క్రమంగా జరుగుతుంది. ఇది కాలక్రమేణా పెరుగుతూ పోతుంది. వంశపారంపర్యంగా రావడం, హార్మోన్ల అసమతుల్యత, వయస్సు పెరగడం, థైరాయిడ్ సమస్యలు లేదా దీర్ఘకాలిక ఒత్తిడి అనేవి దీనికి కారణాలు కావొచ్చు.


డాక్టర్ ప్రకృతి కె ఎన్


జుట్టు పెరుగుదల జీవిత చక్రం


జుట్టు రాలడాన్ని అర్థం చేసుకునే ముందు జుట్టు యొక్క సహజ జీవిత చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం జుట్టు పెరుగుదల ప్రధానంగా మూడు దశల్లో జరుగుతుంది.


జుట్టు పెరుగుదల దశ జరిగే మార్పులు


అనాజెన్ దశ (వృద్ధి దశ - anagen) ఈ దశ 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ దశలో జుట్టు వేగంగా పెరుగుతుంది.


రెస్టింగ్ దశ (telogen) ఇది దాదాపు 3 నెలల కాలం. ఈ సమయంలో పాత జుట్టు రాలిపోయి కొత్త జుట్టు పెరుగుతుంది.


రాలిపోయే దశ (exogen) వాతావరణంలో మార్పుల సమయంలో.. ఎక్కువ వెంట్రుకలు ఒకేసారి రాలిపోయే దశలోకి ప్రవేశించవచ్చు.


1. సీజనల్ హెయిర్ ఫాల్ (తాత్కాలికంగా జుట్టు రాలడం)


వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల అంటే ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలం ప్రారంభంలో జుట్టు రాలడం సహజం.


కారణం: తేమ, ఉష్ణోగ్రత, సూర్యరశ్మిలో మార్పుల వల్ల జుట్టు పెరిగే చక్రం (గ్రోత్ సైకిల్) తాత్కాలికంగా దెబ్బతింటుంది.


కనిపించే గుర్తులు: దువ్వెనలో లేదా దిండుపై జుట్టు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది 6 నుంచి 8 వారాల్లో తగ్గిపోతుంది.


ముఖ్య విషయం: దీనివల్ల జుట్టు సాంద్రత (Density) తగ్గదు. రాలిన చోట మళ్ళీ జుట్టు పెరుగుతుంది.


2. శాశ్వతంగా జుట్టు పల్చబడటం (Permanent Thinning)


ఈ సమస్యను వైద్య పరిభాషలో " ఆండ్రోజెనెటిక్ అలోపేసియా" అంటారు. ఇది క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది.


కారణాలు: వంశపారంపర్యంగా రావడం, హార్మోన్ల అసమతుల్యత, వయస్సు పెరగడం, థైరాయిడ్ సమస్యలు, దీర్ఘకాలిక ఒత్తిడి.


కనిపించే గుర్తులు: 1) పురుషుల్లో: నుదురు వెనక్కి వెళ్లడం, మాడు భాగంలో జుట్టు పలచబడటం.


2) మహిళల్లో: జుట్టు పాపిడి వెడల్పు అవ్వడం, జుట్టు నాణ్యత తగ్గి సన్నగా మారడం.


ఎప్పుడు జాగ్రత్త పడాలి? (హెచ్చరిక సంకేతాలు)


కొన్ని లక్షణాలు కనిపిస్తే అది కేవలం సీజనల్ మార్పు కాదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అవి ఏంటంటే.


జుట్టు రాలడం మూడు నెలల కంటే ఎక్కువ కాలం కొనసాగడం


తల మీద అక్కడక్కడ ప్యాచీలుగా జుట్టు ఊడిపోవడం


స్కాల్ప్ అంటే తల చర్మం బయటకు స్పష్టంగా కనిపించడం


ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12, ప్రోటీన్ లోపం ఉండటం


ఒత్తిడి, జీవనశైలి పాత్ర


తీవ్రమైన మానసిక ఒత్తిడి, శస్త్రచికిత్స లేదా అనారోగ్యం తర్వాత వచ్చే జుట్టు రాలడాన్ని టెలోజెన్ ఎఫ్లువియం అంటారు. ఇది సరైన చికిత్స, ప్రశాంతమైన జీవనశైలిలో తిరిగి నయమవుతుంది. అంతేకాకుండా అతిగా కెమికల్స్ వాడటం, హీట్ స్టైలింగ్ చేయడం కూడా జుట్టును దెబ్బతీస్తుంది.


నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు


సరైన ఆహారం: ప్రోటీన్, ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి.


జాగ్రత్త: జుట్టును గట్టిగా కట్టడం మానుకోవాలి. కెమికల్ ఉత్పత్తులు, ప్రొడక్ట్స్ వాడటం తగ్గించాలి.


వైద్య సలహా: సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్య నిపుణుడ్ని సంప్రదించాలి. దీని వల్ల సమస్య మొదట్లోనే గుర్తించి జుట్టును కాపాడుకోవచ్చు.


జుట్టు ఆరోగ్యం కోసం డైట్ ప్లాన్


జుట్టు అనేది సాధారణంగా కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండాలి.


1) ప్రోటీన్లు:


గుడ్లు: వీటిలో బయోటిన్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యం.


పప్పు ధాన్యాలు: పెసలు, మినుములు, సోయాబీన్స్, చిక్కుళ్ళలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.


మాంసాహారం: చికెన్, చేపలు ముఖ్యంగా సాల్మన్ జుట్టుకు బలాన్నిస్తాయి.


2) ఐరన్, ఫోలిక్ యాసిడ్:


ఆకుకూరలు: పాలకూర, తోటకూర వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ లోపిస్తే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గి రాలిపోతుంది.


బెల్లం, ఖర్జూరం: వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గి జుట్టు రాలడం తగ్గుతుంది.


3) ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్:


నట్స్ & సీడ్స్: బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ జుట్టుకు సహజమైన మెరుపును ఇస్తాయి.


4) విటమిన్ C:


సిట్రస్ ఫ్రూట్స్: నిమ్మ, నారింజ, ఉసిరికాయ వంటివాటిని డైట్‌లో భాగం చేసుకోవాలి. ఉసిరి జుట్టుకు అమృతం లాంటిది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు తెగకుండా చూస్తుంది.


జుట్టు రాలడం తగ్గించడానికి పాటించాల్సిన చిట్కాలు


కేవలం ఆహారమే కాకుండా జుట్టును బాహ్యంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం.


సరైన నూనె వాడకం: వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.


కెమికల్స్‌కు దూరం: సల్ఫేట్, పారాబెన్ లేని మైల్డ్ షాంపూలను వాడండి. అతిగా హెయిర్ డ్రైయర్లు, స్ట్రెయిట్నర్లు వాడటం వల్ల జుట్టు చిట్లిపోతుంది.


తడి జుట్టును దువ్వొద్దు: జుట్టు తడిగా ఉన్నప్పుడు బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఆరిన తర్వాతే వెడల్పాటి పళ్ళున్న దువ్వెనతో దువ్వండి.


ఒత్తిడి తగ్గించుకోవడం: క్రమం తప్పకుండా యోగా లేదా ధ్యానం చేయండి. ఒత్తిడి వల్ల వచ్చే 'టెలోజెన్ ఎఫ్లువియం' నుంచి ఇది మిమ్మల్ని కాపాడుతుంది.


నిద్ర: రోజుకు కనీసం 7-8 గంటల గాఢ నిద్ర జుట్టు కణాల పునరుద్ధరణకు అవసరం. అందుకే తగినంత నిద్ర పోయేలా ప్లాన్ చేసుకోండి.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM