|
|
by Suryaa Desk | Mon, Feb 23, 2026, 10:37 PM
టీ20 ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్‌కు సూపర్-8లో తమ తొలి మ్యాచులో షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18.5 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలింది. దీంతో 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 2 పాయింట్లతో పాటు భారీగా నెట్ రన్ రేట్ కోల్పోయింది. అయితే ఈ మ్యాచు ద్వారా టీమిండియా ఓ అనవసరమైన రికార్డును క్రియేట్ చేసింది.
దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచులో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దీంతో టీ20 ప్రపంచకప్ 2026లో భారత బ్యాటర్లు నమోదు చేసిన డకౌట్ల సంఖ్య 11కి పెరిగింది. ఇందులో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మనే మూడు డకౌట్లు నమోదు చేశాడు. మొత్తంగా 11 డకౌట్‌లతో భారత్.. ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో ఓ ఎడిషన్‌లో తమ అత్యధిక డకౌట్‌ల రికార్డును.. బ్రేక్ చేసింది.
2024 టీ20 ప్రపంచకప్‌లో ఆరుగురు భారత బ్యాటర్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. కానీ ఈసారి దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసే సమయానికే టీమిండియా బ్యాటర్లు 11 సార్లు డకౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికాతో సూపర్-8 మ్యాచులో భారత్ నుంచి.. ఇషాన్ కిషన్, రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యారు.
ఇక మొత్తంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు 159 మ్యాచులలో 12 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో సంజూ శాంసన్ - ఏడు డకౌట్లు, విరాట్ కోహ్లీ ఏడు డకౌట్లు, అభిషేక్ శర్మ - ఆరు డకౌట్లు, సూర్యకుమార్ యాదవ్ - ఆరు డకౌట్లు ఉన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి భారత్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. భారత్ సెమీ ఫైనల్ చేరాలంటే.. జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారీ విజయాలు సాధించాల్సి ఉంది.
Latest News