|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 09:57 PM
అమెరికాలో భారతీయులపై జాతివివక్ష వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో నగర కౌన్సిల్ సమావేశంలో హెచ్-1బీ వీసాదారులు తమ నగరాన్ని ఆక్రమించారంటూ భారతీయులను ఉద్దేశించి స్థానిక నేతలు జాత్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కానీ, ఈ సమావేశానికి హాజరైన భారతీయులు.. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినట్టు సమాచారం. ఫిబ్రవరి 3న చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మీడియా కథనాల ప్రకారం.. ఫ్రిస్కో నగరంలో భారతీయుల సంఖ్య పెరిగిపోతుందని, దీనిపై మాట్లాడేందుకు కౌన్సిల్ సమావేశానికి రావాలని కన్జర్వేటివ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు కైలీ కాంబెల్, మార్క్ పలాసియానోలు సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చారు. దీంతో పలువురు అమెరికా మద్దతుగా ఉండే టోపీలు, మాస్క్‌లు ధరించిన ఈ సమావేశానికి హాజరయ్యారు. నగరంలోని భారతీయ అమెరికన్లు, H-1B వీసాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. సమావేశంలో మార్క్ పలాసియానో ప్రసంగిస్తూ.... ఫ్రిస్కోలో భారతీయ జనాభా పెరగడం యాదృచ్ఛికం కాదని పేర్కొన్నారు. వీసాల జారీలో మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
త్వరలోనే నగరం మొత్తం భారతీయులతో నిండిపోతుందని.. ఇప్పటికైనా మనం మేల్కోవాలని ఆయన అన్నారు. అర్హులైన అమెరికన్ల ఉపాధి, ఉద్యోగాలను లాక్కొనే వీసా ప్రక్రియకు తాను, తన మద్దతుదారులు ఎన్నటికీ వ్యతిరేకమేనని ఆయన ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలను ఆ సమావేశానికి హాజరైన చాలామంది భారతీయ- అమెరికన్లు తీవ్రంగా ఖండించారు. వీసా జారీ ప్రక్రియలో మోసాలను తాము సమర్దించబోమని, కానీ అందుకు ఇక్కడి భారతీయులపై ఆరోపణలు చేయడం తగదని వారు తప్పుబట్టారు. తాము ఇక్కడ ఉండటం వల్ల ఈ ప్రాంతానికి కూడా ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
కాగా, భారతీయులకు ఫ్రిస్కో నగర మేయర్ జెఫ్ చెనీ మద్దతుగా నిలిచారు. కాగా, ఫ్రిస్కోలో భారత సంతతికి చెందిన జనాభా అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2010లో 10 శాతం ఉండగా.. ప్రస్తుతం ఇది 33 శాతానికి పెరిగింది. అయితే, ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో చాలా మంది స్థానికేతరులని నివేదికలు పేర్కొన్నాయి. సమావేశం ముగిసిన తర్వాత, ఫ్రిస్కో కమ్యూనిటీ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయి. భారతీయులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండించారు. కొందరు ఒత్తిడితో తమ సందేశాలను తొలగించుకున్నారు.