|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:53 PM
ఓ టీనేజర్ 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక మహిళను తన ఇష్టానికి వ్యతిరేకంగా గర్భం కొనసాగించమని బలవంతం చేయలేమని, స్త్రీ మాతృత్వపు స్వయంప్రతిపత్తి పుట్టబోయే బిడ్డ హక్కులను తుంగలో తొక్కుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం పునరుద్ఘాటించింది. ఈ మేరకు జస్టిస్ బీబీ నాగరత్న ధర్మాసనం.. అబార్షన్‌ను అనుమతి నిరాకరిస్తూ, గర్భాన్ని కొనసాగించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనబెట్టింది. ప్రసవం తర్వాత ఆ బిడ్డను ఎవరికైనా దత్తత ఇచ్చుకోవచ్చని బాంబే హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీనిని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ‘ఓ మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా గర్భాన్ని కొనసాగించాలని కోర్టు బలవంతం చేయదు’ అని మాతృత్వపు ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఆ అమ్మాయి 17 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన టీనేజర్ వయసు ప్రస్తుతం 18 ఏళ్లు నాలుగు నెలలు కాగా.... 30 వారాల గర్భవతి. ‘‘స్నేహితుడి కారణంగా గర్భం దాల్చిన టీనేజర్.. గర్బాన్ని కొనసాగించడం వల్ల శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్నల ధర్మాసనం పేర్కొంది. వైద్య బోర్డు నివేదికను పరిశీలించిన తర్వాత, అబార్షన్‌కు అనుమతిస్తే బాలికకు ఎటువంటి తీవ్రమైన ప్రమాదం ఉండదని ధర్మాసనం అభిప్రాయపడింది.
అయితే, అబార్షన్‌కు నిరాకరించిన బాంబే హైకోర్టు.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దత్తత ఇవ్వొచ్చన్న తెలిపింది. ఆమె తరఫున లాయర్ పెళ్లి కాకుండా బిడ్డకు జన్మనివ్వడం వల్ల సమాజంలో ఆమెను చిన్నచూపు చూస్తారని, బలవంతంగా గర్భం కొనసాగించడం తీవ్ర మానసిక వేదనకు దారితీస్తుందని వాదించారు. అబార్షన్‌పై ఆలస్యంగా నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ, అప్పీలుదారుడి హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇరువర్గాల వాదనలను ధర్మాసనం ప్రస్తావిస్తూ.. గర్భాన్ని కొనసాగించడానికి బాలిక ఇష్టపడకపోవడాన్ని ప్రధానంగా పరిగణించాలని పేర్కొంది. స్నేహితుడితో ఆమె సంబంధం అంగీకారంతో జరిగిందా? కాదా? అనేది ఇక్కడ సమస్య కాదని స్పష్టం చేసింది.
భారతీయ చట్టాల ప్రకారం.. 20 వారాల్లోపు గర్భవిచ్ఛిత్తికి ఎటువంటి అనుమతి అవసరం లేదు. 24 వారాలు అయితే పిండం ఎదుగుదలలో లోపాలు లేదా తల్లి ఆరోగ్యానికి ముప్పు ఉందా? లేదో తెలుసుకోవడానికి మెడికల్ బోర్డును సంప్రదించాలి. ఆ తర్వాత కోర్టు అనుమతితో మాత్రమే అబార్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే, గతంలోనూ సుప్రీంకోర్టు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి ఇచ్చిన సందర్భం ఉంది.
Latest News