|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:12 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 5.25 శాతం వద్దనే కొనసాగిస్తున్నామని తెలిపారు. గతేడాది పలుమార్లు వడ్డీ రేట్లలో కోతలు విధించిన ఆర్‌బీఐ, ఈ సారి అలాగే ఉంచింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్ వంటి రుణాల మీద వడ్డీ భారం పెరగదు. ఇది సామాన్యులకు పెద్ద ఊరట.ఫిబ్రవరి 2025 నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ రెపో రేటును 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈఎంఐలు కట్టేవారికి ఊరట లభించింది. కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత జరుగుతున్న ఈ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ జరగడం, త్వరలో ఇది అమల్లోకి రానున్న క్రమంలో ఆర్బీఐ నిర్ణయాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. వ్యాపారులు, మార్కెట్ వర్గాలు కూడా ఆర్బీఐ నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం 10 గంటలకు తన విధాన ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆరుగురు సభ్యుల కమిటీ రెపో రేట్లను 5.25 శాతంగా కొనసాగిస్తూ విధాన వైఖరిని తటస్థం వద్ద ఉంచాలని నిర్ణయించింది.కాగా డిసెంబర్‌లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. అప్పటివరకు 5.50 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 5.25 శాతానికి తగ్గించింది. ఇప్పుడు మాత్రం ఎలాంటి మార్పులు చేయకూడదని నిర్ణయించింది. కాగా ఆరోగ్యకరమైన ఖరీప్ ఉత్పత్తి, తగినంత ఆహార ధాన్యాల బఫర్ నిల్వలు, అనుకూలమైన రబీ విత్తనాల క్రమంలో ఆహార సరఫరా అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు.
Latest News