|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:28 PM
ఆయన ఓ ప్రముఖ జ్యోతిషుడు. ఆయన చెప్పే జ్యోతిషంపై జనాలకు ఎంతో నమ్మకం. తరుచూ టీవీలో ఆయన ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ, అతడ్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో బాగోతం బట్టబయలైంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడు.. తన గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ప్రియురాలి భర్త, అతడి స్నేహితుడిపై శిష్యులతో కలిసి దాడిచేశాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోవడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. షాకింగ్ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు కమలాకర్ భట్ సహా నలుగుర్ని ఓ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం... ఉత్తర కన్నడ జిల్లాకు కమలాకర్ భట్ బెంగళూరులో ఉంటూ జ్యోతిషం చెబుతుంటాడు. ఈ క్రమంలో అవరగుప్ప గ్రామానికి చెందిన వివాహిత సుచిత్ర నాయక్, ఆమె భర్త మహేశ్ నాయక్‌లు, పిల్లలతో కలిసి బెంగళూరులో ఉండేవారు. ఒకసారి కమలాకర్ భట్‌ను ఈ దంపతులు కలిశారు. వారి పరిచయం సుచిత్రతో వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజుల తర్వాత భార్య, పిల్లలను తమ సొంతూరు అవరగుప్పకు పంపిన మహేశ్.. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే, గ్రామానికి వెళ్లిన తర్వాత జ్యోతిషుడితో సుచిత్ర సంబంధం కొనసాగించింది. భర్తకు తెలియకుండా బెంగళూరుకు వచ్చిన అతడ్ని కలిసి వెళ్లేది. ఈ విషయం ఆమె పెద్ద కుమార్తె పసిగట్టి. తండ్రికి చెప్పి, బెంగళూరు నుంచి రప్పించింది. తన బండారం బయటపెట్టిందనే అక్కసుతో తన కుమార్తెను సుచిత్ర తీవ్రంగా కొట్టి హింసించింది. దీంతో కమలాకర్ భట్, తన తల్లి సుచిత్రపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తండ్రి మహేశ్, ఆయన స్నేహితుడు వసంత నాయక్‌లతో కలిసి సిద్దాపురం పోలీస్ స్టేషన్‌కు బాలిక వెళ్లింది.
అక్కడ నుంచి తిరిగి వస్తుండగా కమలాకర్ భట్, అతడి శిష్యులు, సుచిత్ర, ఆమె తండ్రి కలిసి వీరిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వసంత్ నాయక్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయాలతో మహేశ్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు సుచిత్ర, ఆమె తండ్రి లోకనాథ, కమలాకర భట్ సహా అతడికి సహకరించిన పలువుర్ని నిందితులుగా చేర్చారు.
సుచిత్రా, మహేశ్ నాయక్‌లు 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వీరికి ఇద్దరు కుమార్తెలని పోలీసులు తెలిపారు. కమలాకర్ భట్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పటి నుంచి భర్తతో విబేధిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో కుమార్తెను చిత్రహింసలు పెట్టిందని అన్నారు.