|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:39 PM
గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన జగన్.. 9 వాహనాల భారీ కాన్వాయ్‌తో గుంటూరు చేరుకున్నారు. దారిపొడవునా వైసీపీ అభిమానులు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. వారి కోసం జగన్.. మధ్య మధ్యలో వాహనం నుంచి బయటకు కనిపిస్తూ.. అభివాదం చేస్తూ వచ్చారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని జగన్.. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెబుతారు. అక్కడ ఇటీవల ధ్వంసమైన ఇల్లు, ఆఫీసును కూడా జగన్ పరిశీలిస్తారు. మరోవైపు పోలీసులు రోప్ పార్టీతో భారీ భద్రత కల్పించారు. గుంటూరు నగరంలో ఎక్కడికక్కడ టెన్షన్ వాతావరణం ఉంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి.మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కేసు నమోదైంది. తన వ్యాఖ్యలు తప్పేనని అంబటి కూడా ఒప్పుకున్నారు. ఆవేశంలో అలా అనేశానని అన్నారు. పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉంచారు. అరెస్ట్ తర్వాత టీడీపీ కార్యకర్తలు అంబటి ఇల్లు, ఆఫీసుపై దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. మరోవైపు జగన్.. శుక్రవారం జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
Latest News