|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 03:21 PM
తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా పెద్దపులి సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటివరకు పులి పాదముద్రలే కనిపించగా, నిన్న రాత్రి తొలిసారిగా పెద్దపులి ప్రత్యక్షంగా కెమెరాల్లో చిక్కింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు పెరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిన్న ఉదయం రాజమండ్రి శివారులోని గాడాల ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు పెద్దపులి వీడియోను చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాడాల ప్రాంతంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించడంతో అక్కడ బోన్‌లు ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా పెంచారు. రాత్రి 7 గంటలు దాటిన తర్వాత రాజమండ్రి శివారు ఆటోనగర్ వెనుక ప్రాంతంలో పెద్దపులిని చూసినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇంతలోనే పులి దివాన్‌చెరువు పరిధిలోని ఎస్‌వీపీఎస్ ఫంక్షన్ హాల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్య ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లినట్లు సమాచారం అందింది. దీంతో యంత్రాంగం మొత్తం అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.
Latest News