|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:08 PM
తిరుమల లడ్డు అంశంలో వాస్తవాలను దాచిపెట్టి భక్తుల విశ్వాసాలతో సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్‌డీడీబీ నివేదిక ప్రకారం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న అర్థం వచ్చేలా మాట్లాడ్డాన్ని తప్పు పట్టారు. సీబీఐ సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం ఎన్‌డీడీబీ నివేదికలో జంతు కొవ్వు లేదని, తేలడంతో ఆత్మరక్షలో పడ్డ సీఎం, టీడీపీ–జనసేన నేతలు ఎదురుదాడికి దిగారని విమర్శించారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే వైయస్ఆర్‌సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని.. అందులో భాగంగానే వైయస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, తన ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ దొంగలు వీరే అంటూ దుష్ప్రచారం చేయడం పక్కా ప్రణాళికతో జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు ఈ అబద్ధాలను నమ్మడం లేదన్న అసహనంతోనే వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పినా, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఆయనతో పాటు జోగి రమేశ్ ఇళ్లపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీబీఐ నివేదికలో బయటపడ్డ నిజాలను మరుగునపర్చేందుకే ఈ హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారని తేల్చి చెప్పారు. సీబీఐ సిట్ అనుబంధ ఛార్జిషీట్ ప్రకారం, కల్తీ నెయ్యి తయారు చేసిన ప్రధాన నిందితుడు బోలేబాబా డెయిరీ చంద్రబాబు హయాంలోనే టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. మరో నిందిత సంస్థ ప్రీమియర్ డెయిరీకి కూడా చంద్రబాబు హయాంలోనే 90 శాతానికి పైగా నెయ్యి సరఫరా అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లడ్డూలో పందికొవ్వు, ఆవుకొవ్వు, చేపనూనె కలిసిందంటూ మాట్లాడటం ద్వారా శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రతిష్టను భంగం కలిగించినది చంద్రబాబు కాదా అని నిలదీశారు. భగవంతుడిని రాజకీయ పావుగా వాడుకున్నది ఎవరో ప్రజలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు.
Latest News