|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:58 PM
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మరింత దిగజారి బ్లడ్ బుక్ రాజ్యాంగం నీడలోకి వెళ్లిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయని, వ్యక్తులపై దాడులు దాటిపోయి ఇప్పుడు ఇళ్లను తగులబెట్టడం, హత్యాయత్నాలకు పాల్పడే స్థాయికి పాలన చేరిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని, రాయలసీమలో బలిజలు బలైపోతుంటే, తెలగలు తెగనరకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళికతో జరుగుతున్న సామాజిక అణచివేత రాజకీయమని విమర్శించారు. కాపులంతా ఏకమై తెలుగుదేశం పార్టీని భూస్దాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. నాడు కాపుల్లో బలమైన నాయకుడిగా ఎదుగుతున్న వంగవీటి రంగాను అత్యంత దారుణంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వనే హతమార్చింది.కాపులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను ఎలా అవమానించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.నేడు అదే కూటమి ప్రభుత్వ హయాంలో కాపు నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబులను రాజకీయ కక్షసాధింపులకు గురిచేస్తున్నారు. చివరకు అధికార టీడీపీలో ఉన్న కందుకూరు నియోజకవర్గం దార్కానిపాడులో కూడా ఒక కాపు నేత బలైపోవడం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూపుతోంది.తిరుమల లడ్డూపై సీబీఐ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి, చంద్రబాబు చెప్పిందే నిజమన్నట్లుగా వ్యవహరించడాన్ని ప్రశ్నిస్తే వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ మా పార్టీ అధినేత ఫోటోలతో ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు తప్పుడు ప్రచారాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై రాళ్లు, కర్రలతో వందల మంది దాడికి దిగారని అన్నారు. దాడి విజువల్స్ చూస్తే ఇది యాదృచ్ఛికం కాదని, ప్రభుత్వ అండతో జరిగిన పక్కా కుట్ర అని స్పష్టమవుతోంది. బూతుల రాజకీయాలకు పుట్టినిల్లే టీడీపీ. టీడీపీ మహిళా నేత భీమినేని వందనాదేవి నోటి నుంచి వచ్చిన అత్యంత జుగుప్సాకరమైన బూతులు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. సంస్కారం, అక్షరజ్ఞానం నేర్పాల్సిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఇలాంటి వ్యక్తికి పదవి ఇవ్వడమే టీడీపీ సంస్కృతికి నిదర్శనం. మంత్రులు అచ్చన్నాయుడు, అనిత, ఇతర నేతలు వాడిన భాష రాష్ట్ర ప్రజలంతా చూశారు అని మండిపడ్డారు.
Latest News