|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 08:48 PM
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా దక్షిణ లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను మళ్లీ పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఇజ్రాయెల్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ట్యాంక్ వ్యతిరేక క్షిపణులను ప్రయోగించేందుకు ఉపయోగించిన అల్-ఖియామ్ సమీపంలోని ఒక నిర్మాణాన్ని కూడా ఐడీఎఫ్ సైనికులు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణం నుంచి హిజ్బుల్లా కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.దక్షిణ లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హిజ్బుల్లాకు చెందిన ఆయుధ నిల్వ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు చేసింది. ఈ దాడులకు ముందు పౌరులకు ఎలాంటి హాని కలగకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టామని, ఆయా ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.ఈ ఆయుధ కేంద్రాలలో ఒకటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాల మధ్యలో ఉన్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. లెబనాన్ పౌరులను హిజ్బుల్లా ‘మానవ కవచాలుగా’ ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. పౌర మౌలిక సదుపాయాల మధ్య నుంచి సైనిక కార్యకలాపాలు కొనసాగించడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ ఆయుధ కేంద్రాలు ఇజ్రాయెల్ జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతున్నాయని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.కాగా ఈ దాడులు యాదృచ్ఛికంగా జరిగినవి కాదని, వీటి వెనుక స్పష్టమైన భద్రతా కారణాలు ఉన్నాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, దక్షిణ లెబనాన్ సరిహద్దు ప్రాంతాల్లో హిజ్బుల్లా ఎలాంటి సైనిక కార్యకలాపాలు నిర్వహించరాదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ హిజ్బుల్లా మళ్లీ అక్కడ తన స్థావరాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, తమ దేశ భద్రతకు ముప్పు ఉన్నంతకాలం లెబనాన్‌లోని ఏ ప్రాంతంలోనైనా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పౌర గృహాల కింద, పాఠశాలల సమీపంలో హిజ్బుల్లా తన సైనిక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించింది. ఈ పరిణామాలతో ఆ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ సమాజం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.
Latest News