|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 03:32 PM
టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాడులు, ప్రతిదాడులు మన సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్‌లో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవలి పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. "గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగించిన అరాచకాలను మనం వ్యతిరేకించాం. ఇప్పుడు మనమే అలా ప్రవర్తించడం సరికాదు. సోషల్ మీడియాలోని ప్రేరణలకు లోనై స్పందించవద్దు. చట్టాన్ని గౌరవించడమే మన పార్టీ బ్రాండ్ ఇమేజ్" అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి లభించిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతికి రూ.1,088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.500 కోట్లు కేటాయించడం వంటి అంశాలను వివరించాలని కోరారు.
Latest News