|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 12:13 PM
బెంగళూరులో ఓ బిల్డర్ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ జంట భారీ దోపిడీకి పాల్పడింది. సుమారు రూ.18 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, వెండి వస్తువులు, నగదుతో పరారైంది. పనిలో చేరిన కేవలం 20 రోజుల్లోనే పక్కా ప్లాన్‌తో ఈ చోరీకి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది.వివరాల్లోకి వెళ్ళితే... యలహంక కెంపురా మెయిన్ రోడ్‌లో నివసించే బిల్డర్ శిమంత్ ఎస్ అర్జున్ ఇంట్లో దినేశ్, కమల అనే నేపాలీ దంపతులు ఇంటి పనివారిగా చేరారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో శిమంత్ తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి పూజకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నిందితులు, వారి సహచరులతో కలిసి ఇంట్లోకి చొరబడ్డారు.గ్రౌండ్ ఫ్లోర్‌లోని కప్‌బోర్డును ఇనుప రాడ్‌తో పగలగొట్టి సుమారు 10 కిలోల బంగారం, వజ్రాభరణాలను దొంగిలించారు. అనంతరం మొదటి అంతస్తులోని బెడ్‌రూంలో ఉన్న లాకర్‌ను తెరిచి 1.5 కిలోల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు, రూ.11.5 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం చోరీ విలువ సుమారు రూ.18 కోట్లు ఉంటుందని అంచనా. మధ్యాహ్నం 12:38 గంటల సమయంలో ఇంట్లోని మరో పనిమనిషి అంబిక ఈ చోరీని గమనించి వెంటనే యజమాని శిమంత్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు.కేవలం 20 రోజుల క్రితమే పనిలో చేరిన దినేశ్, కమల.. యజమాని కుటుంబ సభ్యుల కదలికలను గమనించి ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మారతహళ్లి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు లేదా వారి సొంత దేశమైన నేపాల్‌కు పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
Latest News