|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 09:20 PM
మలం అమ్మి రూ.3.4 లక్షలు సంపాదించిన వ్యక్తి.. 400 మందిని రక్షించి.. ఎందుకో తెలుసా?(ఫోటోలు- Samayam Telugu)
సాధారణంగా పార్ట్ టైమ్ జాబ్ అంటే డెలివరీ బాయ్‌గానో లేదా డేటా ఎంట్రీ పనులనో చూసుకుంటారు. కానీ కెనడాలోని చిల్లీవాక్‌కు చెందిన ఒక యువకుడు మాత్రం చాలా వింతగా మలం అమ్మి ఏకంగా రూ. 3.4 లక్షలు సంపాదించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది వైద్యశాస్త్రంలో ఒక ప్రాణ రక్షక ప్రక్రియలో భాగంగా జరుగుతోంది.
ఏంటీ ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ ?
మెడికల్ లాంగ్వేజ్‌లో దీన్ని ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగులకు ఆరోగ్యవంతులైన దాతల మలాన్ని వారి పేగుల్లోకి పంపిస్తారు. దీనివల్ల రోగి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది.. వ్యాధి నయం అవుతుంది. సదరు యువకుడు 2025లో 149 సార్లు మలాన్ని దానం చేసి.. సుమారు 400 మంది ప్రాణాలను కాపాడాడు.
ఎంపిక ప్రక్రియ చాలా కఠినం
ఇలా మలం దానం చేయడానికి దాతలుగా ఎంపిక చేసే ప్రక్రియలో ఆరోగ్య ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. దాతలకు రక్త, మూత్ర, మల పరీక్షలతో పాటు శారీరక పరీక్షలు నిర్వహిస్తారు. కేవలం 1 నుంచి 2 శాతం మంది మాత్రమే ఈ నాణ్యమైన మల దానానికి అర్హత సాధిస్తారు.
సదరు యువకుడు తన మలాన్ని ప్రత్యేక కంటైనర్లలో నింపి.. సేకరించేవారు వచ్చే వరకు ప్రత్యేక ఫ్రిజ్‌లో భద్రపరుస్తారు.
తన వింత వ్యాపారంపై ఆ యువకుడు స్పందించాడు. తన స్నేహితులు దీన్ని చూసి నవ్వుకుంటారు.. కానీ మద్దతు ఇస్తారు. తన తాత గతంలో ఇలాంటి ఇన్ఫెక్షన్‌తోనే చనిపోయారని.. అందుకే తన మలం ఇతరుల ప్రాణాలు కాపాడుతోందంటే తమ కుటుంబం కూడా గర్వంగా భావిస్తోందని తెలిపాడు. సోషల్ మీడియాలో అతడిని చాలామంది 'పూప్ పర్సన్' అని పిలుస్తున్నా.. తను మాత్రం వైద్య రంగానికి చేస్తున్న సాయం పట్ల సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.
భారీగా డిమాండ్ ఉన్న మార్కెట్
అమెరికాకు చెందిన 'హ్యూమన్ మైక్రోబ్స్' వంటి సంస్థలు అత్యుత్తమ నాణ్యత గల మలం కోసం ఏటా రూ. 1.5 కోట్ల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. పేగు సంబంధిత వ్యాధులకు ఇది చాలా బాగా పనిచేస్తుండటంతో అంతర్జాతీయంగా ఈ హై క్వాలిటీ స్టూల్ మార్కెట్‌కు విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది.
Latest News