|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 09:07 PM
అబ్బాయి అజిత్ పవార్ మరణం వెనుక కుట్ర ఉందంటూ జరుగుతోందన్న ప్రచారంపై ఆయన బాబాయి, సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్ స్పందించారు. అజిత్ మరణం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని, అది కేవలం ప్రమాదమేనని ఆయన పేర్కొన్నారు. దీనిని రాజకీయం చేయవద్దని శరద్ పవార్ విజ్ఞప్తి చేశారు. ‘కొందరు ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు.. ఇది కేవలం ప్రమాదం మాత్రమే.. ఇది నాకు, మొత్తం మహారాష్ట్రకు తీవ్ర బాధ కలిగించింది. ఈ విషాదాన్ని రాజకీయం చేయవద్దని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అన్నారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బాబాయి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
అజిత్ పవార్ మరణంపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. విమానం కూలిన ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ‘ప్రతిపక్ష రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏమిటో నాకు తెలియదు, కానీ ఆయన అధికార పార్టీతోనే ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితం, పవార్ మహాయుతిని వీడటానికి సిద్ధంగా ఉన్నారని మరో పార్టీకి చెందిన ఒకరు ప్రకటన ఇచ్చినట్టు నాకు తెలిసింది, ఇప్పుడు ఈ రోజు ఇలా జరిగింది’ అని ఆమె ఆరోపించారు.
‘సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సరైన విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మాకు సుప్రీంకోర్టుపై మాత్రమే నమ్మకం ఉంది, మరే ఇతర సంస్థపైనా లేదు. అన్ని సంస్థలు పూర్తిగా రాజీపడిపోయాయి’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల వెలువడిన నివేదికలు అలాంటి అవకాశం ఉందని సూచిస్తున్నాయని పేర్కొంటూ, పవార్ తన బాబాయి శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ)లో తిరిగి చేరడానికి సిద్ధమవుతున్నారని ఆమె తెలిపారు. అంతేకాకుండా, రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా పవార్ మరణం అకాల మరణమని, తీవ్ర దిగ్భ్రాంతికరమని అభివర్ణిస్తూ, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఇక, అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో మహాయూతి కూటమిలోని పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. అలాగే, పుణే, పింప్రి-చించివాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బాబాయి- అబ్బాయి కలిసి పోటీచేయడం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో శరద్ వవార్, అజిత్ పవార్‌లు కలిసుపోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమయంలోనే ఆయన అనూహ్యంగా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
Latest News