|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 12:43 PM
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ ఒక్కో ఇసుక రీచ్ నుంచి కూటమి ఎమ్మెల్యేలు నెలకు రూ.3 కోట్లకు పైగా దోచుకుంటున్నారని ఆరోపించారు. సూరాయపాలెం ఇసుక రీచ్‌పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతర్ చేస్తూ విరివూరు ఇసుక రీచ్‌లో అర్థరాత్రి, వేకువ జామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫొటోలను ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రదర్శించారు. ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా ఎలా దోచేస్తున్నదీ ఆయన వివరించారు. సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న ఇలాంటి వారికి బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లాలని కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇసుకను అక్రమంగా దోచుకుంటున్న వారు దొరికితే అరెస్ట్ చేసి శిక్షించాల్సిన పోలీసులు మంత్రి పర్మిషన్ అడగడం ఏమిటని మండిపడ్డారు. పైగా కూటమి నాయకుల ఇసుక దందాను బయటపెట్టడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటే కూటమి నాయకుల దందాకు కలెక్టర్, ఎస్పీ లైసెన్స్ ఇచ్చినట్లుగా ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
Latest News