|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 12:42 PM
గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలో పూల అంగళ్లు కూల్చివేయడం టీడీపీ నాయకులు చేసిన దాష్టీకానికి నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల తీరుకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటిగా కదం తొక్కారు. పెనుమూరు బస్టాండ్ వద్ద దాదాపు 30–40 ఏళ్లుగా జీవనాధారంగా పూల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న పేద ప్రజల పూలంగళ్లను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ, పేదల పొట్టకొట్టే చర్యలు రాజకీయ నాయకుల లక్షణం కాదని, ఇది పూర్తిగా అధికార అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి జీవనం సాగిస్తున్న నిరుపేదల జీవనాధారాలను కూల్చి రాక్షసానందం పొందడం అమానుషమని తీవ్రంగా ఖండించారు.“అధికారం నేడు మీ చేతుల్లో ఉండొచ్చు… రేపు అది మారవచ్చు. కానీ మీరు సృష్టిస్తున్న దుష్ట రాజకీయ సంప్రదాయం ప్రజల్లో అశాంతిని పెంచడమే కాకుండా రాజకీయ కక్షలకు విత్తనాలు వేస్తుంది” అని హెచ్చరించారు.
Latest News