|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 09:44 AM
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో భారత జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆధునిక క్రికెట్‌లో హెడ్ కోచ్ పాత్ర ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం కన్నా, వారిని మేనేజ్ చేయడమేనని పేర్కొన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్ అనుసరిస్తున్న ఆటగాళ్ల రొటేషన్ విధానంపై విమర్శలు వెల్లువెత్తాయి.ఈ అంశంపై నిన్న ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో కపిల్ దేవ్ మాట్లాడారు.ఈ రోజుల్లో 'కోచ్' అనే పదం చాలా సాధారణమైపోయింది. గౌతమ్ గంభీర్ కోచ్ కాలేడు, అతను జట్టుకు మేనేజర్ మాత్రమే. మనం స్కూల్, కాలేజీల్లో నేర్చుకునేవారిని కోచ్‌లు అంటాం. ఒక లెగ్ స్పిన్నర్‌కు లేదా వికెట్ కీపర్‌కు గంభీర్ ఎలా కోచింగ్ ఇవ్వగలడు అతను ఆటగాళ్లను మేనేజ్ చేయగలడు, వారిలో స్ఫూర్తి నింపగలడు. అదే ఇప్పుడు ముఖ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.ఆటగాళ్లకు అండగా నిలవడమే మేనేజర్, కెప్టెన్ ప్రధాన కర్తవ్యమని కపిల్ అన్నారు.ఫామ్‌లో లేని ఆటగాళ్లకు ధైర్యం ఇవ్వాలి. బాగా ఆడిన వారితో కాకుండా, సరిగా రాణించని ఆటగాళ్లతోనే నేను డిన్నర్ చేసేందుకు ఇష్టపడతాను. వారికి ఆత్మవిశ్వాసం కల్పించడం చాలా అవసరం. కెప్టెన్ అంటే కేవలం వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాదు, జట్టును ఏకతాటిపై నడపడం కూడా అని తన కెప్టెన్సీ అనుభవాలను కపిల్ పంచుకున్నారు
Latest News