|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:15 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలన దోపిడీ విధానానికి ప్రతీకగా మారిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో ఒక్క వెన్నుపోటుతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు, ఇప్పుడు ఒక్క కలం పోటుతో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను దోచుకునే విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చీరాగానే దోపిడీ మొదలైందని, తన అనుచరుల పేర్లతో యధేచ్చగా ప్రభుత్వ ఆస్తులను కాజేస్తూ ప్రజాసంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో తాకట్టు పెట్టడం దారుణమని, వైయస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు.ప్రైవేట్ సంస్థల చేతిలో మెడికల్ కాలేజీలను పెట్టి, ప్రభుత్వమే జీతాలు చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. ఆ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తే, కాలేజీలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించవచ్చు కదా అని నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రులను రోడ్ల నిర్మాణంతో పోల్చడం అత్యంత బాధాకరమని, విద్యా–వైద్యం అనేవి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతలని, ఈ కనీస అవగాహన కూడా చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు.లక్షల కోట్ల దోపిడీ కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతోందని, ఇదే తరహాలో ఇకపై ప్రభుత్వ పాఠశాలలను కూడా ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర సాగుతోందని ఆరోపించారు. అన్నీ ప్రైవేట్ చేతికి అప్పగిస్తే ప్రభుత్వం అవసరమేంటి? అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
Latest News