|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:08 PM
తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షకుడిగా తనను తాను అభివర్ణించుకుంటూనే... వేల కోట్ల రూపాయలు విలువైన భూమిని ప్రైవేటు హోటల్ కి కేటాయించడం ద్వారా సీఎం చంద్రబాబు స్వామివారికి తీరని ద్రోహం చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు భూములు కట్టబెట్టడం పై తమండిపడ్డారు. కేవలం రూ.18 కోట్లు విలువైన టూరిజం భూమికి బదులుగా, రూ.460 కోట్ల విలువైన 20 ఎకరాలు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబడ్డారు. ఇది టీటీడీకి తీరని ద్రోహమని... బహిరంగ మార్కెట్ లో రూ.3వేల కోట్ల విలువైన విలువైన భూమిని... ఒబెరాయ్ కి గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయడాన్ని, స్వామి వారి ఆస్తులను దోచిపెట్టడమేనని తేల్చిచెప్పారు. దీన్ని పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడీగా అభివర్ణించారు. ఒబెరాయ్ కు భూమి కేటాయింపులతో రూ.2 కోట్ల బిల్డింగ్ ఫండ్, రూ.26 కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేయడాన్ని తప్పు పట్టారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ తతంగం నిర్వహిస్తున్నారని నిలదీసిన భూమన... ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అతిపెద్ద అవినీతి అని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూ దోపిడీపై స్వాములు, పీఠాధిపతులు ప్రశ్నించాలని విజ్ఞప్తి చేసిన ఆయన... ప్రతి హిందువు దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
Latest News