|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:22 PM
అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్ తీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. నిందితుడి కోసం దేశవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలో తన గర్ల్‌ఫ్రెండ్ అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి ఒక పాడ్‌కాస్ట్‌కు కాష్ హాజరుకావడం తీవ్ర చర్చ జరుగుతోంది. చట్టసభ సభ్యులు, ఎఫ్బీఐ మాజీ ఏజెంట్లు, రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ.. FBI అత్యవసర బాధ్యతలను కాష్ పటేల్ విస్మరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
కాష్ పటేల్, తన ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్‌తో కలిసి కన్జర్వేటివ్ పాడ్‌కాస్టర్ కేటీ మిల్లర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బ్రౌన్స్ యూనివర్సిటీలో కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్న సమయంలో ఆయన పాడ్‌కాస్టర్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం తీవ్రమైన నేరంతో పోరాడుతుంటే ఆయనకు సమయం దొరికిందా? అని దుమ్మెత్తిపోస్తున్నారు. తన గర్ల్‌ఫ్రెండ్ కోసం గతంలో కూడా పటేల్ ఎఫ్‌బీఐ వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.
విల్కిన్స్ ప్రదర్శనలకు ఎఫ్‌బీఐ విమానంలో వెళ్లడం, ఆమెకు FBI రక్షణ కల్పించడం, మత్తులో ఉన్న ఆమె స్నేహితుడ్ని ఇంటికి ఏజెంట్లను తీసుకెళ్లాలని ఆదేశించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను అప్పట్లో కాష్ పటేల్ ఖండించినప్పటికీ, బ్రౌన్ షూటింగ్ దర్యాప్తు సమయంలో ప్రియురాలితో చెట్టపట్టాలేసుకుని తిరగడం అవి మళ్లీ తెరపైకి వచ్చాయి.
కేటీ మిల్లర్ విడుదల చేసిన టీజర్‌లో పటేల్, విల్కిన్స్ నవ్వుతూ తమ సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడుకున్నారు. ఈ క్లిప్ వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పాడ్‌కాస్ట్‌లో విల్కిన్స్ తనపై వచ్చిన ‘మొసాద్ హనీపాట్’ ఆరోపణలను ఖండించారు. తాను యూదు, ఇజ్రాయెల్‌కు చెందినదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు తన భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొంటూ ఎఫ్‌బీఐకు లీగల్ కన్సల్టెంట్ సాయంతో ఆమె దావా వేశారు.
కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ క్లిప్‌ను రీపోస్ట్ చేస్తూ.. ‘బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులకు తెగబడిన దుండగుడు ఇంకా స్వేచ్ఛగా తప్పించుకుని తిరుగుతుంటే.. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌కు తన గర్ల్‌ఫ్రెండ్‌తో తిరగడానికి, పాడ్‌కాస్ట్‌లో పాల్గొనడానికి ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడానికి సమయం దొరికింది’ అని విమర్శించారు.
మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ కైల్ సెరాఫిన్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఇలాంటి వాళ్లను ఏం చేయాలి?’ అని ప్రశ్నించారు. కాగా, బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల కేసులో అనుమానితుడి కొత్త ఫోటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. దుండగుడిని పట్టుకోవడానికి సమాచారం అందించిన వారికి 50,000 డాలర్లు రివార్డు ప్రకటించింది.
Latest News