|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 08:24 PM
శాససభ ఎన్నికలకు ముందు బిహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ పథకం కింద ఒక్కో మహిళకు రూ.10 వేలు చెప్పున మొత్తం 75 లక్షల మంది ఖాతాలకు నితీష్ కుమార్ సర్కారు నగదు జమచేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో కొంతమంది పురుషుల ఖాతాల్లోకి కూడా నగదు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. వాటిని రికవరీ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు.
చలికాలంలో పిల్లలు ఎందుకు ఎక్కువగా రోగాల బారిన పడతారో తెలుసా? డాక్టర్ చెప్పిన చిట్కాలు మీ చిన్నారులకు శ్రీరామ రక్ష
బిహార్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్నికలకు ముందు ‘సీఎం మహిళా రోజ్‌గార్ యోజన’ పథకంలో భాగంగా సెప్టెంబరు 26న మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున నితీష్ కుమార్ ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. దర్బంగా జిల్లా అహియారి గ్రామంలోని పురుషుల ఖాతాలకు సాంకేతిక లోపం కారణంగా రూ.10వేలు జమ అయ్యాయి. ఈ తప్పిదాన్ని గుర్తించిన అధికార యంత్రాంగం ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ సొమ్మును దీపావళి, చట్ పూజల కోసం ఇప్పటికే ఖర్చు చేశామని వారు చెప్పినట్టు ఓ అధికారి పేర్కొన్నారు.
బాతులు, మేకలు కొనుగోలు చేశామని చెప్పిన కొందరు.. ఇప్పుడు ఆ డబ్బులు తాము తిరిగివ్వలేమని తెగేసి చెప్పారు. దీంతో వారి నుంచి నగదు రికవరీ చేయడం ఇబ్బందికరంగా మారిందని అధికారులు తెలిపారు. తమ దగ్గర అంత మొత్తంలో డబ్బు లేదని, అధికారుల తప్పిదం వల్ల జరిగింది కాబట్టి పూర్తిగా మాఫీ చేయాలని ముఖ్యమంత్రి నీతీష్ కుమార్‌ను అహిరియా గ్రామంలోని పురుషులు కోరడం గమనార్హం.
నాగేంద్ర రామ్, బలరామ్ సాహ్ని, రామ్ సాగర్ కుమార్ అనే దివ్యాంగులకు ఖాతాలకు రూ.10 వేలు చొప్పున నగదు జమైనట్టు గుర్తించారు. వీరు మాట్లాడుతూ.. తమతో పాటు పలువురికి ఇలాంటి నోటీసులే వచ్చాయని అన్నారు. తాము నగదు బదిలీ పథకానికి దరఖాస్తు చేయలేదని, ప్రభుత్వమే మా ఖాతాలకు రూ.10 వేలు జమ చేసిందన్నారు. ‘దివ్యాంగుడ్ని కావడంతో ఆ డబ్బులను దీపావళి, ఛట్ పూజలకు వాడుకున్నాను.. కొందరు మేకలు, బాతులు కొన్నారు.. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇప్పుడు నోటీసులు వచ్చాయి.. వాటిని మేము ఎక్కడ నుంచి తీసుకొచ్చేది’ అని నాగేంద్ర రామ్ ప్రశ్నించాడు.
ఈ అంశంపై బిహార్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శర్వణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నగదు బదిలీల్లో తప్పిదాలపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని జీవీక అధికారులను కోరాను.. దీనిపై ఏదైనా ఉంటే, వాటిని వీలైనంత త్వరగా నాకు తెలియజేయండి.. ఇది ఆందోళన కలిగించే విషయం’ అని ఆయన వ్యాఖ్యానించారు.