|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 07:30 PM
నర్సింగ్ కోర్సులు చదివినవారికి జర్మనీ ఆహ్వానం పలుకుతోంది. నర్సింగ్ కోర్సులు పూర్తిచేసి.. జర్మన్ భాష వచ్చిన వారికి ఆ దేశంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే ఆకర్షణీయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాయి. జర్మనీలోని వృద్ధుల అవసరాలకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు నర్సులు లేకపోవటంతో.. జర్మనీలో నర్సులకు మంచి డిమాండ్ ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్థులు జర్మనీలో ఉద్యోగావకాశాలు పొందేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం వంటి కోర్సులు చదువుతున్న వారికి.. జర్మన్ భాషను సైతం నేర్పించే కార్యక్రమాలు మొదలుపెట్టింది.
ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు చేసిన ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మహిళలు ఇందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలని వెల్లడించింది. ఆసక్తిగల వారికి ఆరు నెలలు జర్మన్ భాషలో ట్రైనింగ్ ఇస్తామని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చాముండేశ్వరరావు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మధురవాడ పరదేశీపాలెంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ బాలికల హాస్టల్‌లో ట్రైనింగ్, వసతి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అనంతరం.. వారికి జర్మనీలో ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. జీతం కూడా నెలకు రూ.2.40 లక్షల నుంచి రూ.3.10 లక్షల వరకూ ఉంటుందని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 9030108030 ఫోన్ నంబర్ సంప్రదించాలని సూచించారు. మరోవైపు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగం చేసేందుకు.. జర్మన్ భాషలో ఏ1, ఏ2, బీ1, బీ2 వంటి స్థాయిలలో ప్రావీణ్యం సాధించాలి. ఎందుకంటే జర్మనీ వీసా పొందాలంటే కనీసం బీ1 సర్టిఫికెట్ ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకుని నర్సింగ్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ జర్మనీ భాషను నేర్పిస్తోంది. అయితే నర్సింగ్ కోర్సులు చేసిన వారికి జర్మనీలో ఉద్యోగాలు అంటూ కొన్ని కంపెనీలు కూడా మోసపూరిత ప్రకటనలు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల ద్వారా ట్రైనింగ్ తీసుకోవటం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు.