|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:21 PM
ఈ వారం మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం జోర్డాన్ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ దేశ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. గాజా విషయంలో జోర్డాన్ రాజు పోషించిన క్రియాశీల పాత్రను మోదీ కొనియాడారు. వాణిజ్యం, ఎరువులు, డిజిటల్ టెక్నాలజీ సహా పలు రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. ఇదిలా ఉండగా, జోర్డాన్ రాజకుటుంబానికి భారత ఉపఖండంతో ఉన్న ప్రత్యేక అనుబంధం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఎవరీ సర్వత్ ఇక్రముల్లా?
జోర్డాన్ యువరాణి సర్వత్ ఎల్ హసేన్ భారతీయ మహిళ కావడం విశేషం. ఆమె దేశ విభజనకు వారం రోజుల ముందు 1947లో కలకత్తాలో ప్రముఖ బెంగాలీ ముస్లిం కుటుంబంలో సర్వత్ ఇక్రముల్లా జన్మించారు. ఆమె తండ్రి భారత సివిల్ సర్వీస్‌లో పనిచేసి, దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు మొదటి విదేశాంగ కార్యదర్శి అయ్యారు. ఆమె తల్లి కూడా పాక్ తొలి మహిళా పార్లమెంటేరియన్లలో ఒకరు. ఆమె మొరాకో రాయబారిగా కూడా పనిచేశారు. బ్రిటన్‌లో చదువుకున్న సర్వత్.. తన తండ్రి ఉద్యోగం కారణంగా యూరప్, దక్షిణాసియాలోనే పెరిగారు.
జోర్డాన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హసన్ బిన్ తలాల్‌ను తొలిసారి లండన్‌లో కలిశారు. ఈ పరిచయం ప్రేమగా మారడంతో 1968 ఆగస్టు 28న సర్వత్ ఇక్రముల్లా కరాచీలో ప్రిన్స్ తలాల్ హసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం పాకిస్థానీ, జోర్డాన్, పాశ్చాత్య సంప్రదాయాల కలయికతో జరిగింది. వీరికి నలుగురు సంతానం. హసన్ 1968 నుంచి 1999 వరకు జోర్డాన్ యువరాజుగా ఉన్నప్పుడు.. సర్వత్ యువరాణి హోదాలో విద్య, సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు.
ఆమె 1981లో జోర్డాన్ మొదటి బైలింగ్వల్ ఇంటర్నేషనల్ బాకలారియేట్ విద్యా సంస్థ అయిన అమ్మాన్ బాకలారియేట్ స్కూల్‌ను స్థాపించారు. యువతులు, వికలాంగుల కోసం ప్రత్యేక విద్య కేంద్రం (1974), ప్రిన్సెస్ సర్వత్ కమ్యూనిటీ కాలేజ్ (1980)లను కూడా ప్రారంభించారు. ప్రిన్సెస్ సర్వత్ జోర్డాన్‌లో తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన మొదటి మహిళ. ఆమె జోర్డాన్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 1991 గల్ఫ్ యుద్దం సమయంలో జోర్డాన్, ఇరాక్‌లకు వైద్య సామాగ్రి కోసం ఒక మిలియన్ డాలర్లకు కంటే ఎక్కువ విరాళాలు సేకరించారు. 1999లో కింగ్ హుసేన్ తన సోదరుడైన హసన్‌కు బదులు తన కొడుకు అబ్దుల్లాను వారసుడిగా ప్రకటించడంతో యువరాజు పదవి ముగిసింది.
యువరాణి సర్వత్ చేసిన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆమె 1995లో ఉమెన్ ఆఫ్ పీస్ అవార్డు, 1994లో గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది రినైసెన్స్, 2002లో పాకిస్థాన్ హిలాలే ఇంతియాజ్, 2015లో యూనివర్సిటీ ఆఫ్ బాత్, యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్సివిక్ నుంచి గౌరవ డిగ్రీలు అందుకున్నారు. ఐరోపా రాజకుటుంబ కార్యక్రమాలలో వీరు తరచుగా కనిపిస్తుంటారు.