|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:16 PM
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్న 'GOAT టూర్' ఈవెంట్‌లో తలెత్తిన తీవ్ర గందరగోళం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో.. క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. అరూప్ బిస్వాస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తులలో ఒకరు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో శక్తివంతమైన నాయకుడిగా ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అసలేం జరిగిందంటే?
శనివారం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెస్సీ కేవలం 20 నిమిషాల్లోనే వెళ్లిపోవడంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియాన్ని ధ్వంసం చేసి రచ్చ చేశారు. టికెట్ల కోసం రూ. 15,000 వరకు ఖర్చు చేసిన అభిమానులు.. మెస్సీని నేరుగా చూడలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం.. ఎప్పుడూ మంత్రి బిస్వాస్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు ఆయన్ను చుట్టుముట్టే ఉండటమన్నారు. మెస్సీని చూడలేక నిరాశ చెందిన అభిమానులు మైదానంలోకి వాటర్ బాటిళ్లు విసిరి, స్టేడియం సీట్లను ధ్వంసం చేశారు.
24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు..
మరోవైపు ఈ ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడు సతద్రు దత్తాను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఘటనపై న్యాయమూర్తి (రిటైర్డ్) ఆసిమ్ కుమార్ రాయ్ నేతృత్వంలోని విచారణ ప్యానెల్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా.. సీనియర్ అధికారులపై కూడా సర్కారు కఠిన చర్యలు తీసుకుంది. రాష్ట్ర డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) రాజీవ్ కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి.. నిర్వహణ లోపాలు, భద్రతా వైఫల్యాలపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
బిధానగర్ పోలీసు చీఫ్‌తో పాటు క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ఇలాంటి నోటీసులు జారీ అయ్యాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అనీష్ సర్కార్‌ను కూడా సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో TMC ప్రభుత్వం ఎన్నికల ముందు ఇబ్బందుల్లో పడింది. బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. 96+ఈ సంఘటనపై "నిష్పాక్షిక, పారదర్శకమైన విచారణ" జరిగేందుకు వీలుగా తాను తప్పుకుంటున్నట్లు మంత్రి బిస్వాస్ ముఖ్యమంత్రికి చేతిరాత లేఖలో పేర్కొన్నారు. రాబోయే కీలక అసెంబ్లీ ఎన్నికలకు ముందు TMC అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
Latest News