|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:12 PM
వ్యవసాయం కలిసి రాకపోవడంతో పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న ఓ రైతు.. వడ్డీ వ్యాపారుల దగ్గర లక్ష రూపాయల అప్పుగా తీసుకున్నాడు. అయితే, రోజుకు రూ.10 వేలు వడ్డీ కారణంగా అప్పు రూ. 74 లక్షలకు పెరిగిపోవడంతో చేసేదేమీ లేక కంబోడియాకు వెళ్లి తన కిడ్నీని అమ్ముకోవలసి వచ్చింది. దేశంలో అన్నదాత దుస్థితికి అద్దం పట్టే దారుణమైన ఈ సంఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. చంద్రపూర్ జిల్లా నాగ్‌బిడ్ తాలూకా మింతూరుకు చెందిన యువ రైతు రోషన్ సదాశివ్ కుడేకు సాగులో తీవ్ర నష్టాలు రావడంతో డెయిరీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రోజు వడ్డీకి స్థానిక వడ్డీ వ్యాపారుల వద్ద మొత్తం లక్ష రూపాయాలు అప్పు తీసుకున్నాడు.
అయినా అతడ్ని దురదృష్టం వెంటాడింది. డెయిరీ ప్రారంభం కాకముందే కొనుగోలు చేసిన ఆవులు మృత్యువాతపడ్డాయి. అతడు తన పొలంలో వేసిన పంటలు దెబ్బతిని అప్పుల ఊబిలో కూరుకుపోవడం మొదలైంది. వడ్డీ వ్యాపారులు కుడేను, అతడి కుటుంబాన్ని వేధించడం ప్రారంభించారు. దీంతో వారి అప్పు తీర్చడానికి పొలం, ట్రాక్టర్, ఇంటిలో ఉండే విలువైన వస్తువులను అమ్మేశాడు. అయినా అవి కూడా సరిపోలేదు. ఇంకా, అప్పు మిగిలిపోవడంతో వడ్డీ వ్యాపారుల్లో ఒకరు కిడ్నీ అమ్ముకోమని కుడెకు సలహా ఇచ్చాడు.
ఓ ఏజెంట్ ద్వారా కోల్‌కతాకు వెళ్లిన రోషన్ సదాశివ్ అక్కడ పరీక్షలు పూర్తయిన తర్వాత కాంబోడియాకు పయనమయ్యాడు. అక్కడ ఆపరేషన్ చేయించుకుని కిడ్నీని రూ.8 లక్షలకు అమ్ముకున్నాడు. ఆ డబ్బు తెచ్చి అప్పు తీర్చాడు. లక్ష రూపాయాలు తీసుకుంటే.. రోజుకు రూ.10 వేలు వడ్డీ వేసి రూ.74 లక్షలు వసూలు చేశారని యువరైతు కన్నీటిపర్యంతమయ్యాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, తనను శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యాయని వాపోయాడు. తమకు న్యాయం జరగకుంటే కుటుంబంతో కలిసి ముంబయిలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం మంత్రాలయం వద్ద ఆత్మార్పణం చేసుకుంటామని హెచ్చరించాడు.
వడ్డీ వ్యాపారులను బ్రహ్మపురికి చెందిన కిషోర్ బవన్‌కులే, మనీష్ కల్‌బండే, లక్ష్మణ్ ఉర్‌కుడే, ప్రదీప్ బవన్‌కులే, సంజయ్ బల్లార్‌పూరే, లక్ష్మణ బోర్కర్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) ఎమ్మెల్యే రోహిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా విచారకరమని అన్నారు. ‘‘ఒక రైతు వడ్డీ వ్యాపారి నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి తన కిడ్నీని అమ్ముకోవాల్సి వస్తే, అది ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరం. సంబంధిత వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.
Latest News