|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 08:09 PM
దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ఓ నటి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆమెను కొద్ది రోజులు నుంచి వేరుగా ఉంటోన్న భర్తే అపహరించడం గమనార్హం. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందిన సదరు నటి కుటుంబం.. కూతురి కోసమే ఈ కిడ్నాప్ చేశాడని ఆరోపించింది. ఆమె సోదరి లీలా ఫిర్యాదు ప్రకారం.. నటి చిత్ర, ఆమె భర్త హర్షవర్ధన్ గత ఏడు, ఎనిమిది నెలలుగా వేర్వేరుగా ఉంటున్నారు. హర్షవర్ధన్ హాసన్‌లోనూ.. చిత్ర తన ఏడాది పాపతో కలిసి మగడి రోడ్డులోని అద్దె ఇంట్లో ఉంటోంది. వీరిద్దరికి 2023లో వివాహం కాగా.. ఓ పాప ఉంది.
భర్త నుంచి విడిపోయిన తర్వాత కూడా చిత్ర సీరియల్స్‌లో నటిస్తూనే ఉంది. డిసెంబర్ 7న షూటింగ్ కోసం మైసూరు వెళ్తున్నట్టు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే, ఇది, ఆమె మాజీ భర్త ప్లాన్‌లో భాగమని తెలుస్తోంది. హర్షవర్ధన్ తన సహచరుడు కౌశిక్‌కు రూ. 20,000 అడ్వాన్స్‌గా ఇచ్చాడని, అతడు మరో వ్యక్తి సహాయంతో చిత్రను ఉదయం 8 గంటలకు మైసూరు రోడ్ మెట్రో స్టేషన్‌కు తీసుకెళ్లాడనేది ఆరోపణ. అక్కడి నుంచి ఆమెను కారులో బలవంతంగా NICE రోడ్, బిడది మార్గంలో తీసుకెళ్లారు.
ఆ రోజు ఉదయం 10.30 గంటలకు చిత్ర తన స్నేహితుడు గిరీష్‌ను అప్రమత్తం చేసిందని సమాచారం. గిరీష్ వెంటనే చిత్ర కుటుంబానికి కిడ్నాప్ గురించి సమాచారం ఇచ్చాడు. ఆ సాయంత్రంచి త్ర తల్లి సిద్ధమ్మకు హర్షవర్దన్ ఫోన్ చేసి, కిడ్నాప్ చేసినట్టు తెలిపాడు. ఆమె వదిలిపెట్టాలంటే తన షరతుకు అంగీకరించాలని బెదిరించినట్టు ఫిర్యాదులో ఉంది. ‘‘పాపను తాను చెప్పిన చోటికి తీసుకురాకపోతే, చిత్రను వదిలిపెట్టను’’ అని బెదిరించాడని పేర్కొన్నారు.
తర్వాత మరొకరికి ఫోన్ చేసి, తన కుమార్తెను అర్సికెరెకు తీసుకురావాలని, అప్పుడు చిత్రను సురక్షితంగా వదిలిపెడతానని చెప్పాడని తెలిసింది. మొదట టిప్పుటూరు, బెంగళూరులో కుటుంబసభ్యులు వెతికి చివరకు పోలీసులను ఆశ్రయించారు.నిందితుడు హర్షవర్ధన్ వర్దన్ ఎంటర్‌ప్రైజెస్‌కు యజమాని.. సినిమా నిర్మాత కూడా. చిత్ర సోదరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News