|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 12:43 PM
పీపీపీ పేరుతో రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పార్లమెంటు వద్ద వైయస్ఆర్‌సీపీ ఎంపీలు గళం విప్పారు. ఆ మేరకు పార్టీ ఎంపీలు పార్లమెంటు మకరద్వార్ వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో లోక్‌సభలో వైయస్ఆర్‌సీపీ పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, పార్టీ ఎంపీలు వైయస్ అవినాష్‌రెడ్డి, ఎం.గురుమూర్తి, జి.తనూజారాణితో పాటు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల వైద్య విద్య అభ్యసించాలనుకునే పేద విద్యార్థులను ఆ చదువుకు దూరం చేయడమే కాకుండా, ప్రజారోగ్యంపైనా ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిని కూడా కలిసి ఇదే విషయంపై నివేదించామని, ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. మరోవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభించిందని తెలిపారు. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునే వరకు వైయస్ఆర్‌సీపీ అలుపెరుగని పోరాటం చేస్తుందని శ్రీ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
Latest News