|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 09:17 PM
ఆదివారం ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. సిడ్నీ నగరంలోని ప్రముఖ టూరిస్ట్ ప్రాంతం అయిన బాండీ బీచ్‌లో కొందరు దుండుగులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 16 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. యూదుల పండుగ ప్రారంభమైన తొలి రోజే ఈ దారుణం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో భాగంగా ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు నిందితులు.. 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు.
అయితే బాండీ బీచ్ కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరు తండ్రీకొడుకులు అని తెలిసింది. నిందితులను నవీద్ అక్రమ్, అతడి కొడుకు సాజిద్ అక్రమ్‌గా గుర్తించినట్లు న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ మాల్ లాన్యాన్ వెల్లడించారు. ఈ సంఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీద్ అక్రమ్ అక్కడే మరణించగా.. సాజిద్ అక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడికి పాల్పడిన తండ్రీకొడుకులైన నవీద్ అక్రమ్, సాజిద్ అక్రమ్ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. అయితే వారి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన నవీద్ అక్రమ్ కుటుంబం.. చాలా కాలం నుంచి సిడ్నీ శివార్లలోని బోనిరిగ్, క్యాంప్సీ ప్రాంతాల్లో నివసిస్తూ వస్తోంది. విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం రాత్రి ఈ రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని తేలింది. సోదాలు నిర్వహించి 6 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ చెప్పారు.
ఇక ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ నిందితుడు.. చెట్టు చాటున నక్కి.. సామాన్యులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇది గమనించిన 43 సంవత్సరాల అహ్మద్ అల్ అహ్మద్.. వెంటనే చెట్టు దగ్గరకు వెళ్లి ఆ నిందితుడిని పట్టుకున్నాడు. అతడి చేతిలో ఉన్న తుపాకీని లాక్కుని.. ఆ నిందితుడికే గురి పెట్టాడు. మరో నిందితుడు అతడిపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అహ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన ప్రాణాలకు తెగించి మరీ నిందితుడితో పోరాడిన అహ్మద్‌ని 'రియల్ హీరో' అని ప్రశంసిస్తున్నారు.