|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 08:51 PM
బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బంగారం ఇస్తానని భార్యను ఊరవతలకి తీసుకెళ్లిన భర్త.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్ మీద తీసుకుని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఉండే వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన మహాలక్ష్మి దంపతులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి.. ఇద్దరి పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో.. గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున మాచవరం వెళ్లారు వెంకటేశ్వర్లు. బంగారం ఇప్పిస్తానంటూ భార్యను నమ్మించాడు. అక్కడి నుంచి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ఆపై భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హత్య చేసిన వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత మృతదేహాన్ని బైక్ మీద తీసుకుని సంతమూగులూరు పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంతమాగులూరు పోలీసులు వెంటనే మహాలక్ష్మిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోలీసులు మహాలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట.. ఇలా విభేదాలతో విడిపోవటం.. క్షణికావేశంలో భర్త భార్యను హత్య చేయటంతో.. ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
Latest News