62 ఏళ్ల తర్వాత కేసు గెలిచిన 80 ఏళ్ల వ్యక్తి.. రూ.18 వేలకే రూ.7 కోట్ల ప్రాపర్టీ!
 

by Suryaa Desk | Sun, Dec 14, 2025, 08:35 PM

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 62 సంవత్సరాలు. ఒక కేసులో తుది తీర్పు రావడానికి పట్టిన సమయం ఇది. సీకే ఆనంద్ అనే వ్యక్తికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కేసు మొదలైతే.. అతడికి 80 సంవత్సరాలు వచ్చేసరికి ఈ కేసు గెలిచాడు. కేవలం దాదాపు రూ. 18,000కే రూ. 7 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ దక్కింది. పంజాబ్, హర్యానా ప్రాంతంలోనే పాత కేసుల్లో ఒకటిగా ఉన్న ఈ కేసుకు.. పంజాబ్, హర్యానా హైకోర్టు ముగింపు పలికింది. జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఆ వివరాలు..


ఈ కేసు 1963లో మొదలైంది. M/s ఆర్‌సీ సూద్ అండ్ కంపనీ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఈరోస్ గార్డెన్స్ పేరుతో ఫరీదాబాద్‌లోని సూరజ్ కుండ్ ప్రాంతంలో ఓ రెసిడెన్షియల్ కాలనీ ప్రారంభించింది. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో సీకే ఆనంద్ తల్లి నంకీ దేవీ.. చదరపు అడుగుకు రూ. 24, రూ. 25 చొప్పును 350 స్క్వేర్ యార్డ్స్, 217 స్క్వేర్ యార్డ్స్ విస్తీర్ణంతో రెండు ప్లాట్లను కొనుగోలు చేసింది. ప్లాట్ల ధరలో దాదాపు సగం వరకు డబ్బులు నంకీ దేవీ రియల్ ఎస్టేట్ కంపెనీకి ముట్టజెప్పింది. అయితే సమయం గడుస్తున్నా.. ఈ ప్లాట్లను కొనుగోలుదారులకు ఇవ్వలేదు రియల్ ఎస్టేట్ కంపెనీ.


ఈ నేపథ్యంలో పంజాబ్ షెడ్యూల్డ్ రోడ్స్ అండ్ కంట్రోల్డ్ ఏరియాస్ చట్టం, 1963.. తర్వాత హర్యానా డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ అర్బన్ ఏరియాస్ చట్టం, 1975 అమలులోకి వచ్చాయి. వీటిని కారణాలుగా చూపుతూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ ప్లాట్లను అప్పగించలేదు. అన్ని అనుమతులు వచ్చాక ఇస్తానని నమ్మిస్తూ వచ్చారు. దీంతో ఆ ప్లాట్లను వేరేవాళ్లకు అమ్మేశారేమోననే భయం, వాటిని మూడో వ్యక్తులకు మళ్లీ అమ్మకుండా ఆపడానికి నంకీ దేవీ కోర్టును ఆశ్రయించారు. కొనుగోలు దారులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి.. ఇతరులకు విక్రయించరాదని అప్పట్లో కోర్టు కంపెనీని హెచ్చరించింది.


ప్రస్తుత న్యాయ పోరాటం 2002లో ప్రారంభమైంది. దిగువ కోర్టులు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. రియల్ ఎస్టేట్ డెవలపర్ హైకోర్టును ఆశ్రయించారు. ఒప్పందం కాలం ముగిసిపోయిందని.. 1964లోనే కొనుగోలు ఒప్పందం రద్దు చేశామని వాదించారు. ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్‌ ప్రకారం.. ఆరు దశాబ్దాల నాటి ఒప్పందాన్ని అమలు చేయడం అన్యాయమని వాదించారు. అయితే డెవలపర్ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ప్లాట్ల కొనుగోలు దారుకు అనుకూలంగా శనివారం 22 పేజీల తీర్పు విడుదలైంది. అందులో అప్పటి మార్కెట్ వ్యాల్యూ కంటే 25 శాతం అదనంగా డెవలపర్‌కు ఇవ్వాలని ఆదేశించారు. అంటే 5,103 చదరపు అడుగుల భూమికి అప్పట్లో రూ. 14,000 చెల్లించి కొనుగోలు చేశారు. 25 శాతం ఎక్కువ అంటే ఇప్పుడు దాదాపు రూ. 18 వేలకే రూ. 7 కోట్లు విలువైన ఆ భూమి.. 80 ఏళ్ల సీకే ఆనంద్‌కు దక్కింది.

Latest News
AIADMK likely to allocate 100 seats to allies in TN Assembly polls Wed, Dec 17, 2025, 02:02 PM
MP Cong MLAs protest Centre's move to rename MGNREGA Wed, Dec 17, 2025, 01:57 PM
India's staffing industry surges 5 pc in Q2 FY26 sequentially Wed, Dec 17, 2025, 01:51 PM
Congress MPs protest against Centre on Parliament premises over National Herald case Wed, Dec 17, 2025, 01:46 PM
Searches in J&K's Mansar after villagers report suspicious movement Wed, Dec 17, 2025, 01:15 PM