|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 08:34 PM
బెంగళూరులోని నటి శిల్పా శెట్టి పబ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్, వ్యాపారవేత్త సత్య నాయుడు రచ్చ రచ్చ చేశాడు. మద్యం మత్తులో పబ్ సిబ్బందిపై దాడికి దిగాడు. ఈ ఘటన డిసెంబరు 11న గురువారం రాత్రి ల్యాంగ్‌ఫోర్డ్ రోడ్‌లోని ప్రముఖ పబ్ 'బాస్టియన్'లో చోటుచేసుకుంది. ఈ పబ్‌లో శిల్పాశెట్టికి వాటా ఉంది. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బిల్లు విషయమై సిబ్బందితో గొడవకు దిగిన సత్య నాయుడు.. వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పబ్‌లో సర్వీస్‌కు సంబంధించి వాగ్వాదం తీవ్రమై, సిబ్బందిపై భౌతిక దాడి చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో ఆయన మద్యం సేవించి, మత్తులో ఉన్నారని సమాచారం.
ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు బహిరంగ ప్రదేశాల్లో ఇలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియో వైరల్ కావడంతో క్యూబన్ పార్క్ పోలీసులు స్పందించారు. పబ్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. పబ్ యాజమాన్యం, సిబ్బంది నుంచి ప్రాథమిక వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా? వద్దా? అనేది విచారణ తర్వాత నిర్ణయిస్తామని చెప్పారు. ఘటనను పోలీసులు సుమోటాగా స్వీకరించినట్టు సెంట్రల్ డివిజిన్ డీసీపీ ధ్రువీకరించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా తాను సిబ్బందిపై దాడిచేసినట్టు వచ్చిన ఆరోపణలను సత్యా నాయుడు తోసిపుచ్చారు. తన స్నేహితులతో కలిసి అక్కడ డిన్నర్ కోసం వెళ్లానని అన్నాడు. బిల్లు విషయంలోనే సమస్య వచ్చింది కానీ ఎటువంటి ఘర్షణ జరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనతో పబ్‌లలో మద్యం మత్తులో గొడవలు, సిబ్బంది భద్రత వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. బాస్టియన్ పబ్‌ను 2019లో బెంగళూరుకు చెందిన రంజిత్ బింద్రా భాగస్వామ్యంతో శిల్పాశెట్టి ప్రారంభించారు.
Latest News