|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 01:22 PM
తన రాజకీయ జీవితంలో సీఎం చంద్రబాబు ప్రజలకు, పేదలకు ఉపయోగపడే ఒక్క సంస్కరణ కూడా చేయలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తేల్చి చెప్పారు. 18 నెలల పాలనలో పేదల కోసం ఒక ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేదు సరికదా... పేదలను కొట్టి పెద్దలకు పంచడమే నైజంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ... రెవెన్యూశాఖ పై సమీక్ష చేయడానికి ఏడాదిన్నర టైం తీసుకోవడమే సీఎం చంద్రబాబుకు పేదల పట్ల, వారి సంక్షేమం పట్ల తీరుకు నిదర్శమని తేల్చి చెప్పారు 1977 తర్వాత రాష్ట్రంలో రైతులకు వైయస్.జగన్ ప్రభుత్వంలోనే మేలు జరిగిందన్న ధర్మాన... 2020లో వైయస్.జగన్ తీసుకొచ్చిన భూసంస్కరణల వల్లే పేదలకు మేలు జరిగిందని తేల్చి చెప్పారు.గ్రామకంఠం, చుక్కల భూముల వంటి ప్రజల రెవెన్యూ వివాదాల పరిష్కారానికి శాశ్వత కృషి చేసిన వైయస్.జగన్.. సమగ్ర భూసర్వే ద్వారా 10 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేయడం తో పాటు, 30 లక్షల మందికి పట్టాలు పంపిణీ చేశారని స్పష్టం చేశారు. అయితే భూసర్వేపై అబద్దాలు చెప్పి ప్రజలతో ఓట్లేయించుకున్న టీడీపీ హయాంలో 18 నెలలుగా భూసర్వే కార్యక్రమం నిల్చిపోవడంతో ... ఒక్క పట్టాదారుపాస్ బుక్కూ మంజూరు చేయలేదని మండిపడ్డారు. వైయస్.జగన్ హాయంలో సచివాలయాల ద్వారా ప్రజల చెంతకే సేవలు అందిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం నేడు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో అడ్డూ అదుపూలేని దోపిడీకి చిరునామాగా మారాయని ధ్వజమెత్తారు.
Latest News