|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 09:12 PM
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిప్పటి నుంచి.. ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తమ దేశంలో నివసిస్తున్న వేలాది మందిని ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా తమ దేశాలకు తరలించారు. అయినా ఇంకా కొంత మంది అక్కడే ఉన్నారని తెలుసుకుని.. తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించిన ప్రతీ ఒక్క వలసదారుడికి భారీ జరిమానా విధించనున్నారు. 14 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పత్రాలు లేని వలసదారులపై 5,000 డాలర్లు ( భారత కరన్సీ ప్రకారం సుమారు రూ.4.49 లక్షలు) జరిమానా పడుతుందని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రకటించారు.
అరెస్టు అయిన వెంటనే జరిమానా..
ఈ జరిమానాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్' కింద ఆమోదించారు. సెప్టెంబర్‌లో నెలలోనే ఈ చట్టం అమలు చేసినప్పటికీ.. అప్పుడు జరిమానా కేవలం 1000 డాలర్లుగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 5,000 డాలర్లకు పెంచారు. ఈ 5,000 డాలర్లు రుసుమును 'పట్టుబడినందుకు రుసుముగా' పరిగణిస్తారు. చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన.. 14 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా ఈ జరిమానా చెల్లించాలి. అయితే ఇది సరిహద్దు ప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. వలసదారు ఎక్కడ పట్టుబడ్డా.. ఎంత కాలంగా యూఎస్‌లో నివసిస్తున్నా, వారికి ఇమ్మిగ్రేషన్ కేసులు ఉన్నా లేకపోయినా అరెస్టు చేసిన మరుక్షణమే ఈ రుసుమును విధిస్తారు.
చెల్లించకపోతే ఏమవుతుంది?
ఎవరైనా ఈ 5,000 డాలర్ల రుసుమును చెల్లించలేకపోతే.. ఆ మొత్తం యూఎస్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అధికారిక అప్పుగా మారుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది. ఈ అప్పు రికార్డులో నమోదై ఉంటుంది. దీని వల్ల భవిష్యత్తులో ఆ వ్యక్తి చట్టబద్ధంగా యూఎస్‌లోకి ప్రవేశించడానికి లేదా ఇతర ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు పొందడానికి వీలు లేకుండా పోవచ్చు.
సరిహద్దుల్లో అరెస్టుల సంఖ్య దశాబ్దాల కనిష్టానికి పడిపోయిన (నవంబర్‌లో 7,300) నేపథ్యంలో.. ఫెడరల్ ఏజెంట్లు తమ కార్యకలాపాలను దేశంలోని అంతర్భాగాలకు విస్తరించారు. లాస్ ఏంజిల్స్, చికాగో వంటి నగరాల్లోని కార్ వాష్‌లు, హోమ్ డిపోట్ పార్కింగ్ స్థలాలు, ఇతర పబ్లిక్ ప్రాంతాలలో అరెస్టులు చేస్తున్నారు. ఈ కఠిన చర్యలు అక్రమ వలసలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని యూఎస్ అధికారులు భావిస్తున్నారు.