|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:49 PM
గోవా పర్యటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం తెల్లవారుజామున గోవాలోని 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది మరణించగా, వారిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు అనిత, కమల, సరోజ్ జోషితో పాటు వారి బావ వినోద్ కుమార్ కూడా ఉన్నారు. వినోద్ భార్య, అక్కాచెల్లెళ్ల మరో సోదరి అయిన భావన జోష్ని మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.కుటుంబ స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన రోజు రాత్రి వీరంతా భోజనం కోసం క్లబ్‌కు వెళ్లారు. భోజనం ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో వారి సోదరీమణుల్లో ఒకరు లోపల చిక్కుకుపోయారు. ఆమెను కాపాడేందుకు మిగిలిన ఇద్దరు సోదరీమణులు, బావ వినోద్ తిరిగి లోపలికి వెళ్లారు. కానీ, అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో వారంతా అక్కడే సజీవదహనమయ్యారు. భావన ఒక్కరే బయటకు రాగలిగారు.ఢిల్లీలోని కరావల్ నగర్‌లో నివసించే ఈ కుటుంబం గోవాకు వెళ్లడం ఇదే మొదటిసారని, ఎంతో ఉత్సాహంగా ఈ ట్రిప్‌కు ప్లాన్ చేసుకున్నారని వారి స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నలుగురి మరణవార్తను వారి వృద్ధురాలైన తల్లికి ఇంకా తెలియజేయలేదు. ఆమె ఆరోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.ప్రమాద సమయంలో క్లబ్‌లో తీవ్ర గందరగోళం నెలకొందని, బయటకు వెళ్లేందుకు సరైన మార్గాలు లేకపోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రాణాలతో బయటపడిన భావన తెలిపారు. పొగ దట్టంగా కమ్ముకోవడంతో చాలా మంది బయటకు రాలేకపోయారని, ఎవరో తనను బయటకు తోయడం వల్లే ప్రాణాలతో బయటపడ్డానని ఆమె చెప్పినట్లు సమాచారం.
Latest News