|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:49 PM
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో స్క్రబ్ టైఫస్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం మరో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతులను పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూరమ్మ (59), బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన డి. నాగేంద్రమ్మ (73)గా అధికారులు గుర్తించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లూరమ్మ నవంబర్ 28న ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు తెలిసింది. నాగేంద్రమ్మ తీవ్ర జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో చేరారు. ఇద్దరికీ నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, శనివారం రాత్రి ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ధనమ్మ (64) కూడా ఇదే వ్యాధితో జీజీహెచ్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.మరో వైపు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు చర్యలు ముమ్మరం చేసింది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్డులో 14 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Latest News