|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:39 PM
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణాకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎక్కువగా మద్దతిస్తున్నారంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పష్టతనిచ్చాడు. హర్షిత్ రాణాకు జట్టులో వరుస అవకాశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం అతని బ్యాటింగ్ సామర్థ్యమేనని గంభీర్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని హర్షిత్ రాణాను దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం బౌలింగ్ ఆల్-రౌండర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు గంభీర్ తెలిపాడు. "హర్షిత్ లాంటి ఆటగాడిని 8వ స్థానంలో బ్యాటింగ్ చేయగల బౌలర్‌గా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. రాబోయే రెండేళ్లలో దక్షిణాఫ్రికా వంటి పర్యటనలకు వెళ్లినప్పుడు ముగ్గురు ప్రధాన పేసర్లు అవసరమవుతారు. ఆ సమయంలో జట్టుకు సరైన సమతుల్యం చాలా ముఖ్యం" అని గంభీర్ వివరించాడు.
Latest News