|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:37 PM
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి సస్పెన్షన్‌కు గురైన సీనియర్ నేత హుమాయున్ కబీర్ సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 22న తన పార్టీ పేరును వెల్లడిస్తానని, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్లు స్పష్టం చేశారు."డిసెంబర్ 22న నా కొత్త పార్టీ పేరును ప్రకటిస్తాను. మా పార్టీ ఒవైసీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటుంది. ఇప్పటికే నేను ఒవైసీ సాబ్‌తో చర్చించాను. తదుపరి చర్చల కోసం నన్ను హైదరాబాద్ రమ్మని ఆయన ఆహ్వానించారు" అని కబీర్ తెలిపారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని, కేంద్రంలోని బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుందని ఆయన అన్నారు.ఏఐఎంఐఎంతో పొత్తు ఖాయమైందని చెబుతూనే.. సీపీఎం, కాంగ్రెస్, నౌషద్ సిద్ధిఖీకి చెందిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)పార్టీలను కూడా తమ కూటమిలోకి రావాలని కబీర్ ఆహ్వానించారు. "పశ్చిమ బెంగాల్‌లో మా లక్ష్యం 135 సీట్లు. కూటమి అధికారికంగా ఏర్పడ్డాక సీట్ల పంపకాలపై చర్చిస్తాం" అని ఆయన వివరించారు.
Latest News