|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 03:21 PM
కడప నగర పాలక సంస్థ మేయర్ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్త మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు.నోటిఫికేషన్ ప్రకారం, ఈ నెల 11న ఉదయం 11 గంటలకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు పాల్గొని నూతన మేయర్‌ను ఎన్నుకుంటారు. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వైసీపీ నేత, నాటి మేయర్ వి. సురేష్ బాబును పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్‌గా నియమించారు.ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో ఐదు నెలల్లో ముగియనుండటంతో, నగర అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పూర్తిస్థాయి మేయర్‌ను ఎన్నుకోవడం అనివార్యంగా మారింది.ఇదిలా ఉండగా, తనను పదవి నుంచి తొలగించడాన్ని, ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది. కోర్టు తీర్పు తర్వాతే మేయర్ ఎన్నికపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Latest News