|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 12:12 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పు చేసినట్లు వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, పార్లమెంటు కో-ఆర్టినేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు, జడ్పీ వైస్-చైర్పర్సన్లు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు (PAC), సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు (CEC), స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లు (SEC) లతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ టెలి కాన్ఫరెన్స్లో ప్రసంగించిన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు జరిగాయి. గవర్నర్ గారిని జగన్ గారు కలిసే కార్యక్రమం ఈ నెల 17కు వాయిదా పడింది. 16న రాష్ట్రపతి పర్యటన కారణంగా గవర్నర్ గారి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు జరిగాయి. అయితే నియోజకవర్గ స్ధాయిలో మాత్రం ముందుగా అనుకున్నట్లే ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల నుంచి బయలుదేరాలి. అయితే జిల్లా స్ధాయి కార్యక్రమం మాత్రం ఈనెల 13కు బదులుగా 15న జిల్లా స్ధాయిలో ర్యాలీలు జరిపి అక్కడి నుంచి బయలుదేరాలి. 17న గవర్నర్ గారిని మన అధినేత జగన్ గారు కొందరు ముఖ్యనాయకులు కలుస్తారు. మనం చేస్తున్న ఉద్యమం తుది అంకానికి వచ్చింది. కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంకు అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఊహించని ఆదరణ వచ్చింది, కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా జరిగింది, మనం అనుకున్న సంతకాలు కోటి అనుకుంటే అంతకుమించి సంతకాలు వస్తున్నాయి. మనం సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడియా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బాక్సుల్లో సర్ధి వాహనంలో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలి. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నాయకులంతా పాల్గొనాలి. ఈ కార్యక్రమాలన్నీ మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ అవ్వాలి. ఆ తర్వాత జిల్లా స్ధాయిలో జరిగే కార్యక్రమంపై నాయకులంతా దృష్టిపెట్టి సక్సెస్ చేయాలి అని పిలుపునిచ్చారు.
Latest News