|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:36 PM
పేద ప్రజల కోసం ప్రభుత్వం రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మారుతున్న ఆహారపు అలవాట్ల అనుగుణంగా పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే రాయలసీమ జిల్లాలలో గత ఏప్రిల్ నుంచే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డులు ఉన్నవారికి బియ్యం, పంచదారతో పాటు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. ఇదే విధంగా ఉత్తర కోస్తా ప్రాంతంలోని జిల్లాల ప్రజలకు కూడా రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆ జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరి, మన్యం జిల్లాల్లో ఈ నెల నుంచే రాగులు పంపిణీ చేస్తున్నారు. ఇక గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జొన్నల పంపిణీ కూడా ప్రారంభం అయింది. ఈ ప్రాంతాల్లో త్వరలో రాగులు, జొన్నలు కూడా ఇవ్వనున్నారు. కాగా, రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రస్తుతం ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి కొంత బియ్యానికి బదులుగా.. గరిష్ఠంగా 3 కేజీల వరకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే 20 కేజీల రేషన్ బియ్యానికి బదులు రెండు కేజీల రాగులు, 18 కేజీల బియ్యాన్ని తీసుకోవచ్చు. గతంలోనూ రేషన్‌కార్డుదారులకు రాగులు, రాగిపిండిని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే రేషన్ షాపుల్లో తృణ ధాన్యాలు అందిచాలని నిర్ణయించింది.
గతంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా రాష్ట్రంలో అవసరాలకు సరిపడా రాగులు, జొన్నలను కేటాయించేది. అయితే ఇప్పుడు కేంద్రం తృణ ధాన్యాలను కేటాయించడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టెండరు ప్రక్రియ ద్వారా సేకరిస్తోంది. అనంతరం రేషన్ కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తోంది. రాగులు, జొన్నల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అందులో ఇప్పటికే రాయలసీమలో పంపిణీ చేస్తున్నట్లు.. రాగులు, జొన్నలను దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా, అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారులకు కార్డులను అందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు.. వాటి ఇంటి వద్దకే వెళ్లి కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
Latest News