|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 01:49 PM
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని తిట్టడానికే పేరెంట్ టీచర్ మీటింగ్‌లు పెట్టుకునేట్టయితే కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా, ప్రెస్‌మీట్ పెట్టుకుంటే సరిపోదా అని తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ లపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈవెంట్‌లు, సెట్టింగ్‌లు, షూటింగ్‌లు, ఇక్కడికి రావడానికి ప్రత్యేక విమానాల ఖర్చు ఇవన్నీ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ ని కూడా రాజకీయ సభల మాదిరిగా మార్చేసి పిల్లల వైయస్ జగన్‌పై ద్వేష భావం కలిగించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో విద్యా రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడితే చంద్రబాబు సీఎం అయ్యాక పూర్తిగా సర్వనాశనం చేశాడని ఆమె మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ పాల్గొన్న ఈవెంట్‌లో వేసిన బెంచీలు, ఫర్నీచర్, డిజిటల్ బోర్డులన్నీ వైయస్ జగన్ నాడు-నేడు ద్వారా ఆ బడికి తీసుకొచ్చినవేనని స్పష్టం చేశారు. ఏడాదిన్నర లోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పులు తేవడం మినహా ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అమలు చేసిన పాపానపోలేదని ధ్వజమెత్తారు. కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు మాత్రం ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదని, ఎప్పుడెప్పుడూ చంద్రబాబు దిగిపోతాడా అని ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఏడాదిన్నరకే పాలన చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు, ఇంకో మూడున్నరేళ్లు ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమయ్యే పనికాదని నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు.
Latest News