|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 08:53 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. 4 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈనెల 4వ తేదీన ఢిల్లీలో దిగిన పుతిన్.. రెండు రోజులు ఉండి.. డిసెంబర్ 5వ తేదీన రాత్రి తిరిగి రష్యా వెళ్లిపోయారు. అయితే భారత పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే ముందు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఇచ్చిన ప్రత్యేక విందు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులోనే అనేక రకాల వంటలను పుతిన్ రుచి చూశారు. భారత్, రష్యా దేశాధినేతలతోపాటు.. మంత్రులు, దౌత్యవేత్తలు, ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. అయితే ఈ రాష్ట్రపతి విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను వడ్డించడం విశేషం.
పుతిన్ కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన శాఖాహార విందులో భారతీయ, నేపాలీ రుచులు కలిసి ఉన్నాయి. ఆరోగ్యకరమైన మునగాకు సూప్, కాశ్మీరీ వాల్‌నట్ చట్నీతో కూడిన గుచ్చి డూన్ చెటిన్ (మష్రూమ్), జోల్ మోమో (నేపాలీ వంటకం), జాఫ్రానీ పన్నీర్ రోల్ వంటి రకరకాల వంటకాలు మెనూలో ఉన్నాయి. ఇక ఈ విందులో కేసర్-పిస్తా కుల్ఫీ, బాదం హల్వా వంటి వింటర్ డెజర్ట్‌లు కూడా ఉన్నాయి.
మునగాకు సూప్
మునగాకు, పెసర పప్పుతో తయారు చేసిన ఈ హెల్తీ సూప్‌ను కరివేపాకుతో గార్నిష్ చేసి ఇచ్చారు. ఇది త్వరగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడుతుంది.
గుచ్చి డూన్ చెటిన్
కాశ్మీరీ వాల్‌నట్ చట్నీతో నింపిన మోరెల్ మష్రూమ్స్‌తో తయారు అపెటైజర్ గుచ్చి డూన్ చెటిన్‌ను కూడా మెనూలో చేర్చారు.
కాలే చనే కే షికంపురి
నల్ల శనగల నుంచి తయారు చేసిన ఈ కబాబ్‌లను పుదీన చట్నీ, షీర్‌మల్ బ్రెడ్ (మొఘల్ రోటీ)తో కలిపి వడ్డించారు.
వెజిటబుల్ జోల్ మోమో
నేపాలీ రుచిగల జోల్ మోమోలను వాటర్ చెస్ట్‌నట్, కారంగా ఉండే టమాటా సాస్‌తో వడ్డించారు.
ప్రధాన వంటకాలు (మెయిన్ కోర్స్)
రిచ్ గ్రేవీలు, సీజనల్ కూరగాయలతో కూడిన వంటకాలు మెయిన్ కోర్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
జాఫ్రానీ పన్నీర్ రోల్
పన్నీర్, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన జాఫ్రానీ పన్నీర్ రోల్‌కు కుంకుమపువ్వు ఫ్లేవర్‌తో అందించారు.
పాలక్ మేతీ మట్టర్ కా సాగ్
పాలకూర, మెంతి ఆకులను పచ్చి బఠాణీలతో బాగా వండి.. ఆవాలతో తాళింపు వేసిన ఒక రకమైన గ్రేవీ పాలక్ మేతీ మట్టర్ కా సాగ్‌ను కూడా వడ్డించారు.
తందూరీ భర్వాన్ ఆలూ
మసాలాలు, పెరుగుతో నానబెట్టిన బంగాళాదుంపలను తందూర్‌లో గ్రిల్ చేసి వడ్డించారు.
ఆచారీ బైంగన్
ఆవకాయ మసాలాలతో వంకాయలను స్వీట్, హాట్‌గా వండారు.
యెల్లో దాల్ తడ్కా
ప్రతి భారతీయుల ఇంట్లో నిత్యం చేసుకునే.. పప్పును అందించారు. అందులో ఇంగువ కూడా వేశారు. జీలకర్రతో తాలింపు వేసి వడ్డించారు.
డ్రై ఫ్రూట్ సాఫ్రన్ పులావ్
బాస్మతి బియ్యంతో వండిన పులావ్‌ను కుంకుమపువ్వు ఫ్లేవర్‌తో రుచికరంగా వండారు.
భారతీయ బ్రెడ్స్
బిస్కటీ రోటీ, లచ్చా పరాఠా, సతానాజ్ రోటీ, మిస్సీ రోటీ, మగాజ్ నాన్ వంటి రకరకాల భారతీయ రోటీలను ఉంచారు.
స్వీట్స్, డెజర్ట్స్
విందు చివరలో వడ్డించిన స్వీట్స్, స్నాక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.
బాదం హల్వా
వేయించిన బాదాం, ఇతర నట్స్‌తో గార్నిష్ చేసిన బాదాం హల్వాను పుతిన్‌కు వడ్డించారు.
కేసర్-పిస్తా కుల్ఫీ
కుంకుమపువ్వు, పిస్తా, యాలకులతో చేసిన రిచ్ ఇండియన్ ఐస్ క్రీమ్ (కుల్ఫీ) డెజర్ట్‌లలో ఆకర్షణగా నిలిచింది.
ఇవే కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్, గుడ్ సందేశ్ (బెంగాలీ స్వీట్), మురుకులు ఏర్పాటు చేశారు. సలాడ్స్‌లో ఖామన్ కక్డీ, మామిడి చట్నీ, గోంగూర చట్నీ వంటివి ఉన్నాయి. గెస్ట్‌లకు ఆరెంజ్, దానిమ్మ, అల్లం, క్యారెట్ కలిపిన యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ జ్యూస్‌ను కూడా అందించారు.