|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 07:27 PM
చదువంటే.. పదుల్లో ర్యాంకులు, బండెడు పుస్తకాలు కాదు.. చదువుకు మార్కులే కొలమానం కాదు. చదువంటే మనిషి సంపాదించుకునే జ్ఞానం. సంఘ జీవిగా ఎలా మెదగాలో నేర్పే విజ్ఞానం. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువంటే అర్థం మారిపోయింది. స్కూలుకు వెళ్లే చిన్నారులను చూస్తే.. విద్యార్థులా, బాల కార్మికులా అనే పరిస్థితి వస్తోంది. బరువుకు మించిన పుస్తకాలను మోస్తూ చిన్నారి బాల్యం వంగిపోతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తోంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాలని ఎప్పుడో ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తిగా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది.
పుస్తకాల మోత నుంచి విద్యార్థులకు వారంలో ఒక రోజు విముక్తి కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం శనివారం రోజున పాఠశాలల్లో నో బ్యాగ్ డే అమలు చేస్తోంది. ఆ రోజున విద్యార్థులు అందరూ పాఠశాలల్లో ఆటపాటలతో అభ్యసన చేపట్టేలా కార్యక్రమాలు చేపడుతోంది. అయితే కొన్నిచోట్ల నో బ్యాగ్ డే అమలు కాకపోవటంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు కోసం నిధులు మంజూరు చేసింది.ఈ నిధుల సాయంతో నో బ్యాగ్ డే అమలు కోసం కావాల్సిన పరికరాలు కొనుగోలు చేయనున్నారు. దీంతో ఇకపై ప్రతి శనివారం రోజున విద్యార్థులు బ్యాగులు లేకుండానే స్కూళ్లకు వెళ్లవచ్చు.
నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం రోజున ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు పాడుకుందాం, సృజన, నటిద్దాం, మాట్లాడుకుందాం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.3 నుంచి 5వ తరగతి వరకూ.. సృజన, పరిశుభ్రం, చదువుకుందాం, తోటకు పోదాం, విందాం వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇక 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకూ విద్యార్థులతో సృజనాత్మకత, విద్య, వైజ్ఞానిక నమూనాల రూపకల్పన, ఆటపాటలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి పాఠశాలలకునిధులు మంజూరయ్యాయి. ప్రాథమిక పాఠశాలలకు రూ.500, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వేయి చొప్పున నిధులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Latest News